తెలంగాణ ఎన్నికల్లో వారసులు.. లిస్ట్ ఇదే..!
పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీలో ఉన్నారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డికి జూబ్లిహిల్స్ టికెట్ నిరాకరించిన కాంగ్రెస్.. ఆ స్థానంలో అజారుద్దీన్‌ను బరిలో ఉంచింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నేతల వారసులు ఫస్ట్ టైమ్ బరిలో దిగుతున్నారు. దాదాపు అన్ని పార్టీలు వారసులకు అవకాశాలిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఈ యువనేతలు. ప్రధానంగా కంటోన్మెంట్ స్థానంలో ఇద్దరు వారసులు పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీ చేయబోతున్నారు. సాయన్న గతంలో కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల అనారోగ్యంతో సాయన్న కన్నుమూయడంతో బీఆర్ఎస్ ఆయన కుమార్తె లాస్య నందితకు టికెట్ ఇచ్చింది.
ఇక కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల. మొదటగా గద్దర్ కొడుకు సూర్యంకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో గద్దర్ కుమార్తె వెన్నెల కంటోన్మెంట్ నుంచి బరిలో ఉన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు మైనంపల్లి హన్మంతరావు. దీంతో హన్మంతరావుతో పాటు ఆయన కొడుక్కి మొదటి లిస్టులోనే టికెట్ కన్ఫామ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
కాంగ్రెస్ కురవృద్ధుడు జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి ఈసారి బరిలో ఉన్నారు. జానారెడ్డి పోటీకి దూరంగా ఉండటంతో జయవీర్ రెడ్డికి నాగార్జున సాగర్ నుంచి పోటీచేసే అవకాశం లభించింది. ఇక మిర్యాలగూడ నుంచి మరో కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలో ఉంచాలన్న జానారెడ్డి ప్రయత్నాలు ఫలించలేదు.
పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీలో ఉన్నారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డికి జూబ్లిహిల్స్ టికెట్ నిరాకరించిన కాంగ్రెస్.. ఆ స్థానంలో అజారుద్దీన్‌ను బరిలో ఉంచింది. దీంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విష్ణు.. బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
ఇక బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం ఈ ఎన్నికల్లో తన వారసుడు మిథున్ రెడ్డిని బరిలో ఉంచారు. మిథున్ రెడ్డి మొదట షాద్‌నగర్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అక్కడ ప్రచారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. చివరి నిమిషంలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి మిథున్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీజేపీ.
నాగర్‌కర్నూలు నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. కూచుకుళ్ల ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డిని కాదని కూచుకుళ్ల రాజేశ్‌కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం.
అదే విధంగా MIM నుంచి ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ తనయుడు నూరుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే పోటీలో ఉంటారా లేదా అనేది నామినేషన్ల విత్ డ్రా తర్వాత తేలనుంది.