నల్గొండ, భువనగిరి.. ఎంపీ బరిలో కోమటిరెడ్డి వారసులు..!
భువనగరి సీటు కోసం కోమటిరెడ్డి సోదరులలో పెద్దవాడైన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి పవన్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల నుంచి వారసులను బరిలో దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కోమటిరెడ్డి సోదరులు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ రెండు స్థానాల కోసం కోమటిరెడ్డి వారసులు అప్లికేషన్ పెట్టారు. ఈ రెండు స్థానాలు తమ ఫ్యామిలీకే ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు కోరుతున్నట్లు సమాచారం.
భువనగరి సీటు కోసం కోమటిరెడ్డి సోదరులలో పెద్దవాడైన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి పవన్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ ఎంపీ స్థానం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. భువనగిరి స్థానం నుంచి గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు.
అయితే నల్గొండ సీటు కోసం ఇప్పటికే జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు సూర్యాపేట సీటును త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీ సీటును ఇస్తామని గతంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.