తెలంగాణలో వృద్ధులకోసం డే కేర్ సెంటర్లు..

ఇప్పటి వరకూ ప్రైవేటుగా మాత్రమే వృద్ధాశ్రమాలు ఉండేవి. ఇకపై ప్రభుత్వమే వారి బాగోగులను చూసుకునేందుకు ఆశ్రమాలు, డే కేర్ సెంటర్లు ప్రారంభించాలనే ఆలోచన చేస్తోంది.

Advertisement
Update:2022-10-02 08:58 IST

తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకోసం డే కేర్ సెంటర్లు ప్రారంభించబోతోంది. అన్ని జిల్లాల్లో వృద్ధాశ్రమాలు కూడా ప్రభుత్వం తరపున మొదలు పెట్టే ఆలోచన చేస్తోంది. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహ‌మూద్ అలీతో కలసి ఆయన రాష్ట్రస్థాయి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వృద్ధులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యతను నిర్వర్తిస్తామని చెప్పారు.

చట్టపరంగా..

తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు చేజిక్కించుకునేవరకు పిల్లలు వారిని బాగానే చూసుకుంటారు. ఆస్తుల పంపకాలు పూర్తయ్యాక తల్లిదండ్రులకు నరకం చూపెడతారు. దాదాపుగా అన్నిచోట్లా ఇదే జరుగుతోంది. పేద, ధనిక తేడాలేవీ ఉండవు. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినవారు, కటిక పేదలు.. అందరూ వృద్ధాశ్రమాల్లో సమానమే. అయితే ఇప్పటి వరకూ ప్రైవేటుగా మాత్రమే వృద్ధాశ్రమాలు ఉండేవి. ఇకపై ప్రభుత్వమే వారి బాగోగులను చూసుకునేందుకు ఆశ్రమాలు, డే కేర్ సెంటర్లు ప్రారంభించాలనే ఆలోచన చేస్తోంది. ఇక ఆస్తుల విషయంలో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా చట్టంలో సంస్కరణలు కూడా తీసుకు రాబోతోంది. శాఖాపరంగా ఆస్తులను తల్లిదండ్రులకే తిరిగి అప్పగించేలా ఈ సంస్కరణలు ఉంటాయని చెబుతున్నారు మంత్రులు.

వృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు మంత్రులు. వృద్ధులకోసం 14567 హెల్ప్ లైన్ నెంబర్ ను ఆవిష్కరించారు. ఈ టోల్‌ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే వైద్యారోగ్యశాఖ ద్వారా వారికి సేవలందిస్తారు. పిల్లలు, కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదురైతే.. పోలీస్ శాఖకు వివరాలు తెలియజేస్తారు. ఉచిత న్యాయసేవ కోసం జిల్లాకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రులు.

Tags:    
Advertisement

Similar News