కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...దాసోజు శ్రవణ్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచీ ఆయన పార్టీకి దూరం జరిగారు.
దాసోజు శ్రవణ్ తన రాజకీయ జీవితాన్ని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీ తెలంగాణను వ్యతిరేకించడంతో ఆ పార్టీతో విబేధించి టిఆర్ఎస్ లో చేరారు. ఉద్యమంలో కీలకంగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన టిఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ టికట్ ఆశించారు. కానీ టిఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత కూడా ఆయన అదే నియోజక వర్గంపై దృష్టి కేంద్రీకరించి పని చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన ఖైరతాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే విజయా రెడ్డి కాంగ్రెస్ లో చేరడం, ఆమెకే టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆయన కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కొద్ది సేపట్లో ఈ విషయాన్ని మీడియా సమావేశం పెట్టి ప్రకటించబోతున్నారు. ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం. కొంత కాలంగా శ్రవణ్ బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.