దళితబంధులో భాగంగా వాహనాల పంపిణీ
మొత్తం 162 వాహనాలను లబ్ధిదారులకు అందించారు మంత్రి కేటీఆర్. జలమండలి ఈ వాహనాలకు పనికల్పిస్తుంది, తద్వారా లబ్ధిదారులకు ఆదాయం సమకూరుతుంది.
దళితబంధు పథకంలో భాగంగా మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 162 వాహనాలను ఈ సందర్భంగా లబ్ధిదారులకు అందించారు. జలమండలి ఈ వాహనాలకు పనికల్పిస్తుంది, తద్వారా లబ్ధిదారులకు ఆదాయం సమకూరుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వందలాది కుటుంబాలకు ఉపాధి లభించింది. హైదరాబాద్ లో కూడా మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలను ఈ పథకం కింద అందజేయాలని ప్రభుత్వం భావించింది. వాహనాల పంపిణీ ద్వారా దళిత కుటుంబాలకు జీవనోపాధి లభించడంతోపాటు, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచినట్టవుతుందని చెప్పారు మంత్రి కేటీఆర్. 162మందికి ఈ వాహనాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ వాహనాలకోసం రూ.కోటి రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి వాహనానికి జలమండలి పని కల్పిస్తుంది. మూడునెలలకోసారి ఈ వాహనాలను జలమండలి తనిఖీ చేస్తుంది.
దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. భవిష్యత్ లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం అందిస్తామన్నారు. తమ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. గాంధీజీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. గాంధీని ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ పరిపాలిస్తున్నారని చెప్పారు. గాంధీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గాంధీ ఫొటోలు పెట్టుకుని ఢిల్లీలో కొందరు నినాదాలు ఇస్తుంటారని, కేవలం ఫొటోలకు ఫోజులిచ్చి సరిపెడుతుంటారని.. పరోక్షంగా బీజేపీ, కాంగ్రెస్ నేతల్ని విమర్శించారు కేటీఆర్.