బీఫాం కోసం రూ.99వేలు ఫోన్‌పే చేయండి.. తెలంగాణ కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు సైబ‌ర్ నేర‌గాళ్ల ఝ‌ల‌క్‌

సైబర్ నేరగాళ్లు మొదట తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం ఉన్న‌ గాంధీభవన్‌కు కాల్ చేశారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, పార్టీ అభ్యర్థుల వివరాలు వెంటనే ఇవ్వాలంటూ హ‌డావుడి చేశారు.

Advertisement
Update:2024-04-03 21:33 IST

ఎన్నికల వేళ ఎవ‌రికి అందిన‌కాడికి వాళ్లు దండుకోవాల‌నుకుంటారు. మేం మాత్రం ఏం త‌క్కువ తిన్నామా అంటూ సైబ‌ర్ నేర‌గాళ్లూ దూరిపోతున్నారు. తాజాగా కొంద‌రు సైబ‌ర్ క్రిమిన‌ల్స్ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థుల‌కు ఇలాగే ఝలక్ ఇచ్చారు. పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీకు భీ ఫాంలు ఇస్తాం రూ.99వేలు చెల్లించి తీసుకోవాలని చెప్పడంతో అభ్య‌ర్థులు నిజ‌మే అని నమ్మారు. ఫోన్ పే నెంబర్‌కు డబ్బులు చెల్లించాలని అడగడంతో అనుమానం వ‌చ్చి గాంధీభవన్‌కు ఫోన్ చేసి ఆరా తీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

గాంధీభ‌వ‌న్‌కు ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్నారు

సైబర్ నేరగాళ్లు మొదట తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం ఉన్న‌ గాంధీభవన్‌కు కాల్ చేశారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, పార్టీ అభ్యర్థుల వివరాలు వెంటనే ఇవ్వాలంటూ హ‌డావుడి చేశారు. నిజంగానే ఏఐసీసీ కార్యాలయం నుంచి అడుగుతున్నారేమోనని గాంధీభ‌వ‌న్ సిబ్బంది వెంటనే పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు అగంతుకులకు పంపించారు. ఆ డేటా తీసుకున్న నేర‌గాళ్లు అందులోని అభ్య‌ర్థుల నంబ‌ర్ల‌కు ఫోన్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. మీ బీ ఫాం సిద్ధంగా ఉంది.. రూ.99 వేలు ఫోన్ పే చేయాలని అడిగారు. ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇలా అడుగుతున్నారని అభ్య‌ర్థులు గాంధీభవన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వాళ్లు ఏఐసీసీ ఆఫీస్‌కు ఫోన్ చేసి క‌నుక్కుని అలాంటిదేమీ లేద‌ని తేల్చిచెప్పారు. అయితే మొత్తానికి ఎవరూ డబ్బులు చెల్లించక‌పోవ‌డంతో సైబర్ నేరగాళ్ల ప్లాన్ బెడిసి కొట్టింది.

క్లారిటీ ఇచ్చిన గాంధీభ‌వ‌న్

ఈ విష‌యం తెలిసిన వెంట‌నే గాంధీభ‌వ‌న్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాల‌య సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఎంపీ అభ్యర్థులు అంద‌రికీ ఫోన్లు చేసి.. ఢిల్లీ నుంచి పార్టీ ప్రతినిధులు ఎవరూ కాల్స్ చేయడం లేదని, డబ్బులు ఎవరికి చెల్లించవద్దని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News