తెలంగాణ ప్రభుత్వ ఘనత.. ఎల్ఈడీ లైట్లతో రూ.1,864 కోట్ల ఆదా

స్థానిక సంస్థల్లో ఎల్ఈడీ లైట్లు వినియోగం, గృహాల్లో ఎల్ఈడీలను వాడాలని వినియోగదారులను ప్రోత్సహించడంతో భారీగా ఎలక్ట్రిసిటీ వాడకం తగ్గింది.

Advertisement
Update:2023-08-28 07:07 IST

తెలంగాణ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. విద్యుత్ రంగంలో అత్యధిక ఉత్పత్తిని సాధించడమే కాకుండా.. సాంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి.. సాంప్రదాయేతర విద్యుత్ వినియోగాన్ని వాడుకుంటూ అత్యధిక విద్యుత్‌ను ఆదా చేసే రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ బల్బులను వినియోగించాలని గత 8 ఏళ్లుగా ఇస్తున్న పిలుపు మేరకు.. రూ1.864 కోట్ల మేర విద్యుత్ ఆదా అయినట్లు విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి. విద్యుత్ ఆదా, తక్కువ బిల్లులలో స్థానిక సంస్థలపై కూడా భారం తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొన్నది.

స్థానిక సంస్థల్లో ఎల్ఈడీ లైట్లు వినియోగం, గృహాల్లో ఎల్ఈడీలను వాడాలని వినియోగదారులను ప్రోత్సహించడంతో భారీగా ఎలక్ట్రిసిటీ వాడకం తగ్గింది. దీని వల్ల ప్రభుత్వానికి కూడా విద్యుత్ విషయంలో ఖర్చు తగ్గింది. విద్యుత్ వినియోగం తగ్గించడానికి 2016 నుంచి ఎల్ఈడీ లైట్లను వీధుల్లో కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో గత ఎనిమిదేళ్లుగా 14.82 లక్షల ఎల్ఈడీ లైట్లను అమర్చడంతో విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించారు.

ఎల్ఈడీ లైట్ల వినియోగం ద్వారా ఇప్పటి వరకు రూ. 1,864 కోట్ల వరకు ఆదా అయినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. గత ఎనిమిదేళ్లలో 2,663 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా కావడం గమనార్హం. దీని వల్ల ప్రభుత్వానికి రూ.200 కోట్ల మేర ఆదా అయ్యింది. కేవలం ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో మాత్రమే కాకుండా ఇండ్లలో కూడా ఎల్ఈడీ లైట్ల వాడకంపై ప్రచారం చేశారు. దీంతో చాలా వరకు విద్యుత్ వినియోగం తగ్గడం, వినియోగదారులకు విద్యుత్ వ్యయం తగ్గడం గమనార్హం.

అయితే... ఎల్ఈడీ లైట్ల నాణ్యత విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహించాలని వినియోగదారులు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో నాణ్యమైన ఎల్ఈడీలు వాడితే మరింత ఎక్కువగా విద్యుత్‌ను ఆదా చేసే అవకాశం ఉందని అధికారులు కూడా చెబుతున్నారు. మరోవైపు ఆదా చేసి విద్యుత్‌ను మారుమూల ప్రాంతాల్లోని వీధులకు తరలించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


Tags:    
Advertisement

Similar News