ఆ కొత్త మండలానికి.. ఉపఎన్నికకు సంబంధం ఏంటి?

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగితే కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేస్తారంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update:2022-07-24 09:55 IST

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేసింది. అయితే ఇందులో ఒక మండల ఏర్పాటు మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గట్టుప్పలను మండలంగా చేయాలని ఆ ప్రాంతవాసులు ఏడేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. అంతే కాకుండా కొత్త మండలం కోసం నిరసనలు, ఆందోళనలు కూడా చేశారు. ఏడేళ్లలో ఏనాడూ ఆ ఊసే ఎత్తని ప్రభుత్వం.. అకస్మాత్తుగా శనివారం గట్టుప్పలను మండలంగా ప్రకటించింది. కొత్త మండలం ఏర్పడటంతో ఆ ప్రాంతవాసులు సంబరాలు చేసుకున్నారు.

అయితే.. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో మాత్రం చర్చకు దారితీసింది. మునుగోడు నియోజకవర్గంలోని చందూర్ మండలంలో గట్టుప్పల ఒక పంచాయతీగా ఉన్నది. ఎన్నో ఏళ్ల నుంచి దీన్ని మండలంగా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే స్థానిక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయన బీజేపీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. ఇంకా ఆయనకు ఏడాదిన్నర పదవీకాలం ఉండగానే రాజీనామా చేస్తే తప్పకుండా ఉపఎన్నికలు వస్తాయి. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తుగా గట్టుప్పలను మండలంగా ప్రకటించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓడించడానికి ఉమ్మడి నల్గొండ టీఆర్ఎస్ తగిన వ్యూహరచన చేస్తోంది. కొంత కాలం క్రితమే ఆ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులతో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒక వేళ కోమటిరెడ్డి రాజీనామా చేస్తే, ఉపఎన్నిక అనివార్యం అయితే ఆ సీటును ఎలా గెల్చుకోవాలనే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. గట్టుప్పల మండలంగా చేస్తే.. ఆ చుట్టుపక్కల గ్రామాల ఓట్లు తప్పకుండా అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారతాయని కూడా ఆ సమావేశంలో పలువురు అభిప్రాయపడినట్లు తెలిసింది. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి గట్టుప్పలను కొత్త మండలాల జాబితాలో చేర్చినట్లు స్థానికులు అనుకుంటున్నారు.

ఒక వేళ ఉపఎన్నిక రాకపోయినా మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అప్పటికైనా ఈ కొత్త మండలం టీఆర్ఎస్‌కు కలసి వస్తుందని భావిస్తున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. గజ్వేల్‌ను ఈ సారి వీడతారని ఎప్పటి నుంచో వార్తలు కూడా వస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగితే కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేస్తారంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఉపఎన్నికలో వేరే అభ్యర్థిని పెట్టినా.. అసెంబ్లీకి 2023లో జరిగే ఎన్నికల్లో మాత్రం సీఎం కేసీఆర్ స్వయంగా బరిలోకి దిగుతారని స్థానిక నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. కొత్త మండలాన్ని మంజూరు చేయడంతో పాటు ఇతర పెండింగ్ సమస్యలు కూడా 2023లోపు పూర్తి చేసి.. కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

గతంలో పలువురు నాయకులు తమ గ్రామ స్థాయిలో కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేయాలంటూ తీర్మానాలు చేసి అధిష్టానానికి పంపిన విషయాన్ని కూడా వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా కొత్త మండల ఏర్పాటు, రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అంశంతో మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    
Advertisement

Similar News