వైజాగ్ స్టీల్ ప్లాంట్ టేకోవర్ కు బిడ్ వేయాల‌న్న‌ కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతించిన‌ సీపీఐ

సోమవారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి నారాయణ మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.

Advertisement
Update:2023-04-10 19:55 IST

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్వాగతించారు.

సోమవారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి నారాయణ మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.

''విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కైవసం చేసుకునేందుకు సిఎం సరైన నిర్ణయం తీసుకున్నారు. అదానీ గ్రూప్ వంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి కంపెనీ వెళితే దేశానికి తీరని నష్టం. సీఎం కృషిని అభినందిస్తున్నాం’’ అని నారాయణ అన్నారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కైవసం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను తిరిగి గాడిలో పెట్టడంలో తెలంగాణ ప్రభుత్వానికి సిపిఐ అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన అన్నారు. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ యూనిట్లను కొన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించిందని ఆరోపించిన నారాయణ‌, ప్రధాని నరేంద్ర మోడీ వందేభారత్ రైళ్లను దేశ ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా వాటిని కార్పొరేట్ దిగ్గజాలకు విక్రయించడానికి ప్రవేశపెడుతున్నారని అన్నారు.

దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను అదానీ, ఇతర కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ప్రజల సొమ్ముతో ఆధునీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి ఇంటింటికీ ‘బీజేపీ హఠావో దేశ్ బచావో’ పాదయాత్ర చేపట్టాలని సీపీఐ రాష్ట్ర శాఖ నిర్ణయించిందని, పార్టీ బస్సు యాత్ర‌ కూడా ప్రారంభిస్తుందని సాంబశివరావు తెలిపారు. ప్రజాసమస్యలు, కేంద్రం వైఫల్యాలను ఎత్తిచూపేందుకు జులై మొదటి వారంలో యాత్ర నిర్వహించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.

మతతత్వ బిజెపిని ఓడించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా, దేశ లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం పాదయాత్ర లక్ష్యమని ఆయన అన్నారు. అలాగే తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా లేవనెత్తుతామని సాంబశివరావు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News