దేశం, రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలి
తెలంగాణ భవన్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం మొదటి రోజు బీఆర్‌ఎస్ నాయకత్వం కాంక్షిస్తున్న ఒక్కటే అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, చావునోట్లో పెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక కోరికతో మనమంతా గట్టిగా పనిచేస్తున్నాం. ఈ సంవత్సరం కేసీఆర్ నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తిస్థాయిలో పొందాలన్నారు. దీనిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు, చిన్నచిన్న అడ్డంకులను ఎదుర్కొనే శక్తి మీ అందరికీ ప్రసాదించాలని, మీరంతా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో మన స్ఫూర్తిగా కాంక్షించారు. తెలంగాణ ప్రజలు, భారతదేశంలోని ప్రజలందరికీ అంతా మంచే జరగాలని, కులాలు, మతాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా దేశం, రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.తెలంగాణ భవన్ లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ భవన్‌లో 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.