డాక్టర్ కాలేకపోయా.. లీడర్‌నయ్యా.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తన తల్లి శోభ తనను డాక్టర్‌ను చేయాలనుకున్నారని, నాన్న మాత్రం ఐఏఎస్ అధికారిగా చూడాలనుకున్నారని, కానీ తాను ఆ రెండూ కాలేకపోయానని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తన భవిష్యత్తు గురించి తన తండ్రి కేసీఆర్, తల్లి శోభ కన్నకోరికలేవీ తాను తీర్చలేకపోయానని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు తననేం చేయాలనుకున్నారో జీవితంలో అది కాలేకపోయానని.. చివరికి రాజకీయ నాయకుడిని అయ్యానని చెప్పుకొచ్చారు. తన తల్లి శోభ తనను డాక్టర్‌ను చేయాలనుకున్నారని, నాన్న మాత్రం ఐఏఎస్ అధికారిగా చూడాలనుకున్నారని, కానీ తాను ఆ రెండూ కాలేకపోయానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎంసెట్‌లో 1600 ర్యాంకు వచ్చింది.. ఎంబీబీఎస్ సీటు రాలే
అమ్మ కోరిక తీర్చాలని నేను బైపీసీ చదివా. ఎంసెట్ రాస్తే 1600 ర్యాంకు వచ్చింది. కానీ సీటు రాలేదు. ఎందుకంటే.. ఇప్పుడున్నన్ని మెడికల్ కాలేజీలు అప్పుడు లేవని కేటీఆర్ చెప్పారు. అటు పక్కన ఐఏఎస్ అవ్వాలన్న నాన్న కోరికనూ తీర్చలేకపోయాను.. ఎటూ కాకుండా రాజకీయ నాయకుడిని అయ్యాను అని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు.
ఏటా 10 వేల సీట్లు అంటే మాటలా?
ఇప్పుడు మన తెలంగాణలో ఏకంగా 10వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అంటే ఏడాదికి కొత్తగా 10వేల మంది డాక్టర్లను మన రాష్ట్రంలోనే తయారుచేసుకోగలమని కేటీఆర్ చెప్పారు. వైద్య వృత్తి చేసే అవకాశం దక్కడం చాలా అదృష్టమని, బాగా చదివి ప్రజలందరికీ సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు.