ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో ఆగిన పత్తి కొనుగోళ్లు
సీసీఐ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై కొనుగోళ్లను ఆపేశారని మండిపడుతున్న రైతులు
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు స్తంభించాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. అక్టోబర్ 25న పత్తి కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు సాఫీగా సాగిన కొనుగోళ్లు ఇవాళ కొనుగోళ్లు చేయమని జిన్నింగ్‌లను బంద్ పెట్టారు. ఉదయం 6 గంటల నుంచే వందలాది మంది రైతులు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు భారీగా పత్తిని తెచ్చారు. కొనుగోళ్లను ఆపేయడంతో పత్తి మార్కెట్ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. పత్తిలో తేమ పేరుతో సీసీఐ మెలికపెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సీసీఐ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై కొనుగోళ్లను ఆపేశారని మండిపడ్డారు. పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. దీనిపై సీసీఏ అధికారులు, రాజకీయ నేతలు స్పందించడం లేదని వాపోతున్నారు. తిండి లేకుండా ఎంత సేపు వేచి చూడాలంటున్నారు. పత్తి తీసుకొచ్చిన వెహికిల్స్‌కు డబుల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పత్తి కొనుగోలు చేయమంటే మేం చేయాలి అని నిలదీస్తున్నారు.
భైంసా-నిర్మల్ నేషనల్ హైవేపై రైతుల రాస్తారోకో
ముందస్తు సమాచారం ఇవ్వకుండా పత్తి కొనుగోళ్లు నిలివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు భైంసా-నిర్మల్ నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. పత్తి రైతుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇవాళ కచ్చితంగా పత్తి కొనుగోళ్లు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ పొద్దున్నే హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వారిపై ఎస్మా కింద చర్యలు తీసుకోవాలన్నారు. అయినా అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొనుగోళ్లు ఆపేశారు. పత్తిలో తేమ పేరుతో సీసీఐ మెలికపెడుతున్నారని, తక్కువ ధరకు కొంటామని రైతులు వాపోతున్నారు. పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలన్న ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలంటున్నారు. అధికారులు ముందస్తుగా ప్రైవేట్ వ్యాపారులను కట్టడి చేయకుండా ప్రణాళికబద్దంగా చర్యలు చేపట్టకపోవడం, లీజుకు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతున్నదని ఏర్పడుతున్నదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ఆదిలాబాద్ మార్కెట్ వచ్చిన వందలాది పత్తి వాహనాల వేలాదిమంది రైతుల గోడును పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.