టీ.బీజేపీలో లుకలుకలు.. అజ్ఞాతంలోకి రాజాసింగ్‌

బీజేపీ 8 స్థానాలను గెలుచుకోగా.. అందులో రాజాసింగ్ సీనియర్‌గా ఉన్నారు. ఆయన వరుసగా మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement
Update:2023-12-11 11:37 IST

తెలంగాణ బీజేపీలో లుకలుకలు కంటిన్యూ అవుతున్నాయి. అసెంబ్లీలో బీజేఎల్పీ లీడర్‌గా ఎవరు ఉంటారనే విషయంపై తాజాగా వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఫ్లోర్ లీడర్‌గా ప్రకటించకపోవడంతో రాజాసింగ్‌ మనస్తాపానికి గురయ్యారని సమాచారం. ఇక ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఓవైసీని నియమించిన తర్వాత తీసుకున్న నిర్ణయంపైనా ఎమ్మెల్యేల మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో పలువురు అసెంబ్లీలో ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండడాన్ని తప్పు పట్టారని సమాచారం.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలను గెలుచుకోగా.. అందులో రాజాసింగ్ సీనియర్‌గా ఉన్నారు. ఆయన వరుసగా మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో తనకు ప్రత్యేకంగా గది కేటాయించాలని రాజాసింగ్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. తనను బీజేఎల్పీ లీడర్‌గా ప్రకటించకపోవడంతో మనస్తాపం చెందిన రాజాసింగ్‌ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బీజేఎల్పీ లీడర్‌ ఎవరన్నదానిపైనా సస్పెన్స్‌ కొనసాగుతోంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 2018లో రాజాసింగ్ ఒక్కడే గెలవగా.. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ విజయం సాధించారు. అయితే ఒకరికి పదవి ఇస్తే మరొకరు ఇబ్బంది పడతారన్న కారణంతో ఆ టైంలో బీజేఎల్పీ లీడర్‌గా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. బీజేఎల్పీ లీడర్ పదవి కోసం రాజాసింగ్‌తో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రేసులో ఉన్నారు. వీరిలో ఒకరిని ఫ్లోర్ లీడర్‌గా.. మరొకరిని డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    
Advertisement

Similar News