కృష్ణ మరణానికి కారణాలివే.. వైద్య బృందం నివేదిక
రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయన్నారు. కిడ్నీలు ఫెయిల్ కావడంతో నాలుగు గంటల తర్వాత డయాలసిస్ చేశామని చెప్పారు.
సూపర్ స్టార్ కృష్ణ చాన్నాళ్లుగా వయోభారంతో బాధపడుతున్నా.. సడన్ గా ఆయన ఆస్పత్రిలో చేరడం, గంటల వ్యవధిలోనే ఆయన మరణవార్త బయటకు రావడం అందర్నీ కలచివేసింది. అయితే ఇంత సడన్ గా ఆయన ఎందుకు చనిపోయారనే విషయాన్ని వైద్యులు ప్రకటించారు. కృష్ణకు గుండెపోటు రావడం ప్రధాన కారణం కాగా, ఆయనకు ఇతర అవయవాలు పనిచేయకుండా పోవడం మరో కారణంగా ధృవీకరించారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల కృష్ణ చనిపోయినట్లు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు నివేదిక విడుదల చేశారు.
ఆదివారం అర్థరాత్రి ఇంటివద్ద కృష్ణ గుండెపోటుకి గురికాగా ఆయనను కుటుంబ సభ్యులు రాత్రి 2 గంటల సమయంలో కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు సీపీఆర్ చేశారు వైద్యులు. ఆ తర్వాత చికిత్స మొదలు పెట్టారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయన్నారు. కిడ్నీలు ఫెయిల్ కావడంతో నాలుగు గంటల తర్వాత డయాలసిస్ చేశామని చెప్పారు. సోమవారం మొత్తం ఆయనకు చికిత్స కొనసాగించారు.
సోమవారం సాయంత్రానికి అత్యంత విషమం..
వైద్యం కొనసాగుతున్నా.. సోమవారం సాయంత్రానికి కృష్ణ ఆరోగ్యం మరింత విషమించిందని తెలిపారు వైద్యులు. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు వైద్యులు. ఈరోజు తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృష్ణ తుది శ్వాస విడిచినట్టు ప్రకటించారు.