భవన నిర్మాణ కార్మికులకు రేపటి నుంచి కొత్త రూల్స్
భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అయితే వీరంతా డిజిటల్ గుర్తింపు కార్డు కలిగి ఉండాలని సూచించారు మంత్రి హరీష్ రావు. డిజిటల్ కార్డుల కోసం సొంత ఖర్చుతో తన క్యాంపు కార్యాలయంలోనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.
తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కొత్త నియమ నిబంధనలు రేపటినుంచి(ఆగస్ట్-1) అమలులోకి వస్తాయని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. వారి డిజిటల్ గుర్తింపు కార్డుల కాలపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రమాద బీమా పరిమితి లక్షన్నర రూపాయలు కాగా, దాన్ని మూడు లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. పెంచిన మొత్తం రేపటి నుంచి అమలవుతుందన్ననారు.
ఆరోగ్యశ్రీలో 10లక్షల వరకు ఉచిత వైద్యం..
భవన నిర్మాణ కార్మికుల విభాగం కింద ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యాలు పొందవచ్చన్నారు మంత్రి హరీష్ రావు. ఈమేరకు కార్మిక, వైద్యారోగ్యశాఖల మధ్య ఒప్పందం కుదిరిందని, ఆగస్ట్-1నుంచి ఈ ఒప్పందాలన్నీ అమలులోకి వస్తాయన్నారు.
నాదీ బాధ్యత..
భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అయితే వీరంతా డిజిటల్ గుర్తింపు కార్డు కలిగి ఉండాలని సూచించారు మంత్రి హరీష్ రావు. డిజిటల్ కార్డుల కోసం సొంత ఖర్చుతో తన క్యాంపు కార్యాలయంలోనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్డు ఉంటే కార్మిక కుటుంబాలకు కూడా రైతుబీమా తరహాలోనే కార్మిక బీమా అందుతుందని స్పష్టం చేశారు. సిద్దిపేటలోని మందపల్లి శివారులో కార్మిక భవన్ కోసం ఎకరం స్థలం కేటాయించామని, రూ.3 కోట్ల నిధులతో భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
సిద్దిపేటలో భవన నిర్మాణ రంగ కార్మికుల జిల్లా మహాసభలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. మరో మంత్రి మల్లారెడ్డికి ఫోన్ చేసి, ఆయన సంభాషణను అందరికీ వినిపించారు. ఆయన ఎలా కష్టపడి పైకొచ్చారనే విషయాన్ని ఆయన నోటివెంటే మరోసారి చెప్పించారు. అదే సమయంలో జిల్లాకో కార్మిక భవనం నిర్మిస్తామని మంత్రి మల్లారెడ్డి ఫోన్ ద్వారా ప్రకటించారు.