కొత్త మెట్రో కారిడార్ నిర్మాణం - శివారు ప్రాంతాలకు సరికొత్త ఊపిరి

ఎయిర్ పోర్టుకు వెళ్లాలనుకునే ప్రయాణికులతో పాటుగా సాధారణ ప్రజలకు కూడా ఈ కొత్త కారిడార్ ఎంతో ఉపయోగం. ఈ కారిడార్ నిర్మాణంతో శివారు ప్రాంత ప్రజలకు కనెక్టివిటీ పెరగడంతో శివారు ప్రాంతాలు కూడా మెట్రో వేగంతో పోటీ పడి అభివృద్ధిలో పరుగులు పెడతాయి.

Advertisement
Update:2022-12-09 08:40 IST

గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రగతి పరుగులు పెడుతోంది. విశ్వ నగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తున్న తరుణంలో పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఐటీ మొదలుకొని ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా నగరంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రథమ ప్రాధాన్యత కల్పించింది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి ఎస్.ఆర్.డీ.పీ కింద నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం, అండర్ పాస్ ల ఏర్పాటు చేస్తూ సిగ్నల్ ఫ్రీ నగరం దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి.

అదే క్రమంలో మరోవైపు మెట్రో పరుగులు హైదరాబాద్ ప్రజలకు మరింత సౌకర్యంగా మారింది. ప్రస్తుతమున్న కారిడార్లు మియాపూర్‌- ఎల్బీనగర్‌(29 కి.మీ), జేబీఎస్‌-ఎంజీబీఎస్‌(11 కి.మీ), నాగోల్‌-రాయదుర్గం(29 కి.మీ) లతో పాటుగా నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు కొత్త కారిడార్ హైదరాబాద్ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన బుద్వేల్, రాజేంద్ర నగర్, శంషాబాద్ ప్రజలకు నగర అభివుద్ధితో మరింత మమేకం అయ్యే అవకాశం ఏర్పడింది. రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కారిడార్ నిర్మాణం వల్ల ఎంతో ఉపయోగం. అదే క్రమంలో ఈ ప్రాంతాల్లో మెట్రో పరుగులతో రియల్ ఎస్టేట్ కూడా విపరీతంగా పుంజుకోనున్నది.

ఎయిర్ పోర్టుకు వెళ్లాలనుకునే ప్రయాణికులతో పాటుగా సాధారణ ప్రజలకు కూడా ఈ కొత్త కారిడార్ ఎంతో ఉపయోగం. ఈ కారిడార్ నిర్మాణంతో శివారు ప్రాంత ప్రజలకు కనెక్టివిటీ పెరగడంతో శివారు ప్రాంతాలు కూడా మెట్రో వేగంతో పోటీ పడి అభివృద్ధిలో పరుగులు పెడతాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలో నగర శివారు ప్రజలు నగరం నడిబొడ్డుకు చేరుకోవడం మామూలు విషయం కాదు. గచ్చిబౌలి, హై టెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న బుద్వేల్, రాజేంద్ర నగర్, శంషాబాద్ ప్రాంతాలకు చెందిన ఐటీ ఉద్యోగులు సహా వేలాదిమంది ట్రాఫిక్ అవస్థలను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా భారమైనప్పటికీ మణికొండ పరిసర ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. ఈ కొత్త కారిడార్ ఏర్పాటుతో ఇప్పుడు ఈ ఉద్యోగులందరూ తమ తమ కార్యాలయాలకు తమ సొంత ప్రాంతం నుండి రోజూ వచ్చి పోయే వీలు కలుగుతుంది. అద్దెల బాధలు తప్పుతాయి. ఇలా అన్ని విషయాలను విశ్లేషిస్తే.. అటు కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు, ఇటు ఐటీ సహా ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మిస్తున్న ఈ కొత్త కారిడార్ నిర్మాణంతో మేలు కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News