రాజ్‌భవన్ సమీపంలో కొత్త అసెంబ్లీ నిర్మాణం?

భవిష్యత్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే అంచనా ఉన్నది. దీనికి అనుగుణంగా పెద్ద అసెంబ్లీ భవంతిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

Advertisement
Update:2023-06-09 07:39 IST

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపచేసేలా పలు ఐకానిక్ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం దేశంలోనే ఇప్పుడు అతిపెద్ద సెక్రటేరియట్‌గా అవతరించింది. తెలంగాణ పోలీస్ విభాగం కోసం కమాండ్, కంట్రోల్ సెంటర్ కూడా నిర్మించారు. ప్రతీ జిల్లాలో కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. ఇక అన్ని శాఖ అధిపతుల కోసం ట్విన్ టవర్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా కొత్తగా అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

భవిష్యత్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే అంచనా ఉన్నది. దీనికి అనుగుణంగా పెద్ద అసెంబ్లీ భవంతిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. హైదరాబాద్ రాజ్‌భవన్ రోడ్డులోని దిల్‌కుషా గెస్ట్ హౌస్, రాజ్‌భవన్, నర్సింగ్ కాలేజీల చుట్టూ 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ప్రస్తుతం దిల్ కుషా గెస్ట్ హౌస్‌ను పెద్దగా ఉపయోగించడం లేదు. ఇక నర్సింగ్ కాలేజీ కూడా పాతబడిపోయింది. రాజ్‌భవన్ ముందున్న లాన్, రాజ్‌భవన్, పక్కన ఉన్న గెస్ట్ హౌస్ తప్ప మిగిలిన భాగమంతా ఖాళీగానే ఉన్నది. ఈ ప్రాంతంలో అసెంబ్లీ నిర్మిస్తే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు.

ఆ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలించాలని.. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందో లేదో ఒకసారి అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ హెరిటేజ్ భవనం కావడంతో.. దాన్ని విస్తరించే వీలు లేకుండా పోయింది. శాసన సభ, శాసన మండలి వేర్వేరు చోట్ల ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా మంత్రులు సమావేశాల సమయంలో అటూ ఇటూ తిరగాల్సి వస్తోంది. అధికారులకు కూడా ఇది ఇబ్బందిగానే ఉంటోంది. అందుకే కొత్త అసెంబ్లీ, మండలి భవనాలు ఒకే దగ్గర నిర్మించడానికి సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు.

2019 జూన్ 28న ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ కోసం భూమి పూజ చేశారు. కానీ అక్కడ హెరిటేజ్ భవనం ఉండటంతో కూల్చడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో అసెంబ్లీ నిర్మించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవని అధికారులు సూచించారు. రాజ్‌భవన్ వద్ద అసెంబ్లీ నిర్మాణానికి అనుకూలంగా ఉంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా దానికి భూమి పూజ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వీలైతే ట్విన్ టవర్స్, అసెంబ్లీలకు ఒకే రోజు భూమిపూజ చేస్తారనే చర్చ జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News