జవహర్ నగర్‌లో రూ.250 కోట్లతో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి
రోజుకు 2 ఎంఎల్‌డీ కెపాసిటీ గల లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను రాంకీ సంస్థ నిర్మించింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి చెత్తను తీసుకొని వచ్చి జవహర్‌నగర్‌లోని డంప్ యార్డులో పడేస్తారనే విషయం తెలిసిందే. ఇక్కడ భారీగా చెత్తను నిల్వ చేస్తుండటంతో భారీ గుట్టలా మారిపోయింది. దీంతో చుట్టు పక్కల ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎన్జీటీ జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో పారేసే చెత్తకు క్యాపింగ్ చేయడంతో పాటు బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్ చేయాలని ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచింది. చెత్త క్యాపింగ్ కోసం రూ.140 కోట్లు వెచ్చించింది. ఇందులో 65 శాతం నిధులు జీహెచ్ఎంసీ, డంపింగ్ యార్డ్ ట్రీట్మెంట్ కాంట్రాక్టర్ రాంకీ సంస్థలు భరించాయి. మిగిలిన నిధులను స్వచ్ఛ భారత్ పథకం కింద కేంద్రం విడుదల చేసింది. క్యాపింగ్ చేయడం వల్ల జవహర్ నగర్‌లో ప్రధాన సమస్య తీరిపోయింది. ఇక ఆ తర్వాత మురుగు నీటి శుద్ది కోసం లీచెట్ ప్లాంట్ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రోజుకు 2 ఎంఎల్‌డీ కెపాసిటీ గల లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను రాంకీ సంస్థ నిర్మించింది. దీని కోసం రూ.250 కోట్ల ఖర్చు చేసింది. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కావడంతో పాటు పని కూడా ప్రారంభించింది. రాంకీ సంస్థ నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా మురుగు నీరు అనుకున్న స్థాయికి శుభ్రం అవుతున్నట్లు అధికారులు తెలియజేశారు. అంతే కాకుండా లీచెట్ ప్లాంట్‌కు సంబంధించిన ట్యాంకును కూడా నిర్ణీత సమయం ప్రకారం క్లీన్ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన విశేషాలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.