ధరణి కాదు, అంతకు మించి..
దేశంలో గాంధీ కుటుంబంలా.. తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారు అని చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు.
తెలంగాణలో ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. అయితే అంతకు మించిన ప్రత్యామ్నాయం తీసుకొస్తామని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేసి తీరతామన్నారు. బెల్లంపల్లిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
దేశంలో గాంధీ కుటుంబంలా.. తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారు అని చెప్పారు రేవంత్ రెడ్డి. బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్, వివేక్‌లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, అసలు ఉచిత కరెంటుకి పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు రేవంత్ రెడ్డి. ధరణి రాకముందు నుంచే రైతుబంధు అమలు చేశారని, ఇప్పుడు ధరణి తీసేసినా రైతుబంధు ఆగిపోదన్నారు. ధరణి కంటే మెరుగైన సాంకేతికతతో పోర్టల్ తీసుకొస్తామన్నారు. రైతుబంధుని మించి రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని ఉక్కు మహిళ సోనియా అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కూడా తమ బాధ్యతేనని చెప్పారు.
♦