సర్పంచ్ ల నిధులపై గరం గరం.. రేవంత్ రెడ్డి అరెస్ట్
అరెస్ట్ చేసి తరలించే సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు రేవంత్ రెడ్డి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా? అని నిలదీశారు.
సర్పంచ్ లకు నిధులివ్వడంలేదనే ఆరోపణలతో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం అరెస్ట్ లతో ముగిసింది. 'రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్' ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ముందస్తుగా గృహనిర్బంధం చేశారు పోలీసులు. ఆ తర్వాత ఆయన ధర్నాకు వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు.
అరెస్ట్ చేసి తరలించే సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు రేవంత్ రెడ్డి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా? అని నిలదీశారు. దీంతో రేవంత్ ను బలవంతంగా కారులో ఎక్కించి తరలించారు. అటు గాంధీభవన్ వద్ద పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ధర్నాచౌక్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గేటు దూకేందుకు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విజయారెడ్డి ఆందోళన..
ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులు తమతో అనుచితంగా వ్యవహరించారని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి ఆరోపించారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరించిన బంజారాహిల్స్ సీఐ నరేందర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కార్పొరేటర్ విజయా రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. మొత్తమ్మీద సర్పంచ్ ల నిధులకోసం కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ప్రయత్నం ఉద్రిక్తంగా మారింది, చివరకు అరెస్ట్ లతో ముగిసింది.