మూడో లిస్ట్ తర్వాత కాంగ్రెస్ కి దూరమయ్యే కీలక నేత ఆయనేనా..?
తొలి జాబితా తర్వాత పొన్నాల లక్ష్మయ్య, రెండో లిస్ట్ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి వంటి కీలక నేతలు బయటకెళ్లిపోయారు. తాజాగా మూడో లిస్ట్ విడుదలైంది. ఇప్పుడు కూడా మరో కీలక నేత కాంగ్రెస్ కి దూరమవుతారని అంటున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ లిస్ట్ లు విడుదలయ్యేకొద్దీ కీలక నేతలు ఆ పార్టీకి దూరమవుతున్నారు. తొలి జాబితా తర్వాత ఏకంగా మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీకి దూరమయ్యారు. ఇద్దరు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా బయటకెళ్లిపోయారు. రెండో లిస్ట్ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి వంటి కీలక నేతలు బయటకెళ్లిపోయారు. తాజాగా మూడో లిస్ట్ విడుదలైంది. ఇప్పుడు కూడా మరో కీలక నేత కాంగ్రెస్ కి దూరమవుతారని అంటున్నారు. ఆయనే దామోదర రాజనర్సింహ.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మూడో లిస్ట్ తర్వాత తన అసంతృప్తి బయటపెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణ ఖేడ్, పటాన్ చెరు సీట్ల కేటాయింపు విషయంలో ఆయన అలిగారు. తాను సూచించిన ఇద్దరికి టికెట్లు ఇవ్వకపోవడంతో ఏకంగా పార్టీని వీడేందుకు ఆయన నిర్ణయించుకున్నాడని సమాచారం. అభిమానులు, అనుచరులతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారట, భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
నారాయణఖేడ్ నుంచి సంజీవరెడ్డికి, పటాన్ చెరు నుండి శ్రీనివాస్ గౌడ్ కు టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సూచించారు. కానీ ఆ ఇద్దరికీ జాబితాలో చోటు లేకుండా పోయింది. నారాయణఖేడ్ నుండి సురేష్ కుమార్, పటాన్ చెరు నుండి నీలం మధుకి టికెట్లు దక్కాయి. వీరిద్దరికీ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందని దామోదర రాజనర్సింహ అనుమానం. బీఆర్ఎస్ లో టికెట్ దక్కని నీలం మధుకి కాంగ్రెస్ లో ఎందుకి టికెట్ ఇచ్చారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆ రెండు టికెట్ల విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అంటున్నారు. ఈ దశలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ సీరియస్ నిర్ణయం తీసుకుంటే.. మూడో లిస్ట్ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లే తొలి నేత ఆయనే అవుతారు.