ఎంపీ ఎన్నికల్లో తక్కువ సీట్లు.. తెలంగాణకు కాంగ్రెస్ కమిటీ
తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణకు పి.జె.కురియన్, రకీబుల్ హుస్సెన్, పర్గాట్ సింగ్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టమ్ మొదలుపెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణతో పాటు ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌ఘర్, మధ్యప్రదేశ్‌లో తక్కువ సీట్లు రావడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని భావించింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి సైతం 14 సీట్లలో విజయం సాధించబోతున్నామని ప్రకటనలు చేశారు. ఐతే ఫలితాలు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ చెరో 8 సీట్లను గెలుచుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్ సీటును సైతం కాంగ్రెస్ కోల్పోవడం గమనార్హం. ఇక్కడ బీజేపీ అభ్యర్థి డి.కె.అరుణ విజయం సాధించారు.
దీంతో తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణకు పి.జె.కురియన్, రకీబుల్ హుస్సెన్, పర్గాట్ సింగ్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించి.. పార్లమెంట్ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేకపోవడానికి గల కారణాలను తెలుసుకోనుంది. అనంతరం హైకమాండ్‌కు రిపోర్టు సమర్పించనుంది.
ఇక కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ.. బీజేపీ మెజార్టీ సీట్లను సాధించింది. మొత్తం 28 పార్లమెంట్ సీట్లకు గానూ 17 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఇక జేడీఎస్ రెండు స్థానాలను గెలుచుకుంది. కర్ణాటకలోనూ ముగ్గురు సభ్యుల బృందం పర్యటించనుంది. ఈ కమిటీలో మధుసూదన్ మిస్త్రీ, గౌరవ్ గొగోయి, హిబి ఈడెన్ ఉన్నారు. ఐతే కమిటీలు రిపోర్టు సమర్పించాక హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.