తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం రేసులోకి వీహెచ్.. రాజీవ్ గాంధీ కోరికట

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు తాను కూడా సీఎం రేసులో ఉన్నానంటూ బాంబ్ పేల్చారు.

Advertisement
Update:2023-05-20 13:36 IST

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా ఊపొచ్చింది. దాంతో కొంత మంది సీనియర్ నేతలు సీఎం రేసులో తానున్నాంటూ అప్పుడే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్‌ని వీడిన నేతలు మళ్లీ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కానీ ఎవరూ అతని మాటల్ని సీరియస్‌గా తీసుకోలేదు సరికదా.. రివర్స్‌లో సెటైర్లు పేల్చారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు తాను కూడా సీఎం రేసులో ఉన్నానంటూ బాంబ్ పేల్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే పదవులు ఒరిజినల్ నేతలకే ఇవ్వాలని సూచించిన వీహెచ్.. కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. అంతేకాదు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అప్పట్లో తనని ముఖ్యమంత్రిని చేయాలని ఆశించినట్లు కూడా వీహెచ్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని హైకమాండ్‌తో పాటు రేవంత్ రెడ్డికి కూడా త్వరలోనే విన్నవిస్తానన్నారు.

కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడిన తీరు.. కాంగ్రెస్‌కి మళ్లీ ఎందుకు అధికారం ఇచ్చామా? అని అక్కడి జనం బాధపడేలా చేసింది. తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే.. అంతకుమించి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పొసగని చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఎన్నికలు సమీపించేకొద్దీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News