ప్రత్యక్ష రాజకీయాల్లోకి జానారెడ్డి కొడుకు.. సాగర్‌ టికెట్‌ కోసం దరఖాస్తు..!

జానారెడ్డికి జయవీర్‌, రఘువీర్‌.. ఇద్దరు కుమారులుండగా, జయవీర్‌ నాగార్జున సాగర్‌ నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. ఉపఎన్నిక నాటి నుంచే జయవీర్ సాగర్‌లో పార్టీ లీడర్లు, ప్రజలతో టచ్‌లో ఉంటున్నారు.

Advertisement
Update:2023-08-24 19:00 IST

కాంగ్రెస్ సీనియర్​ నేత, మాజీ సీఎల్పీ లీడర్ ​కుందూరు జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతున్నారా..! అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ఆయన కొడుకు జయవీర్‌ రెడ్డి.. నాగార్జున సాగర్‌ టికెట్‌ కోసం గాంధీభవన్‌లో దరఖాస్తు చేస్తున్నారు. వయోభారంతో బాధపడుతున్న జానారెడ్డి.. ఇటీవల కొంత అనారోగ్యానికి గురయ్యారు. కొడుకులను బరిలోకి దింపడానికి ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన జానారెడ్డి.. BRS అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. అయితే 2021లో నోముల నర్సింహయ్య చనిపోవడంతో సాగర్‌ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఉపఎన్నికలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి, నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ చేతిలో పరాజయం చవిచూశారు జానారెడ్డి. అప్పుడే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ​ప్రకటించారు. కానీ, రేవంత్​రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టడంతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్​ గ్రూపులను సమన్వయం చేయడంలో జానారెడ్డి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. జానారెడ్డికి జయవీర్‌, రఘువీర్‌ ఇద్దరు కుమారులుండగా.. జయవీర్‌ నాగార్జున సాగర్‌ నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. ఉపఎన్నిక నాటి నుంచే జయవీర్ సాగర్‌లో పార్టీ లీడర్లు, ప్రజలతో టచ్‌లో ఉంటున్నారు. రఘువీర్ రెడ్డి మిర్యాలగూడలో క్యాంప్ ఆఫీసు ఓపెన్​ చేశారు. మిర్యాలగూడలో జరిగే అన్ని కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు.

ఇక 1983లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన జానారాడ్డి.. చలకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చలకుర్తి నుంచి దాదాపు ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనతో నాగార్జునసాగర్‌కు మారిన జానారెడ్డి అక్కడి నుంచి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2018లో ఓడిపోయారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి అనేక పదవులు, హోదాల్లో ప‌నిచేశారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన సీఎం అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది.

*

Tags:    
Advertisement

Similar News