కాంగ్రెస్ పార్టీది రాష్ట్రానికో నీతి.. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేయడానికి మళ్లీ వస్తున్నాయని.. కానీ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు.

Advertisement
Update:2023-08-20 18:46 IST

కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. 50 ఏళ్లుగా రాష్ట్రానికి ఏమీ చేయని ఆ పార్టీ.. ఇప్పుడు మళ్లో సారి అవకాశం ఇవ్వాలని కోరుతోంది. ఇటీవల తాను పెన్షన్లు పెంచాను. అయితే తాము అధికారంలోకి వస్తే రూ.4వేలు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. మరి వాళ్లు పాలిస్తున్న ఏ రాష్ట్రంలో రూ.4వేలు పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటకలో అధికారంలో ఉన్నది వాళ్లే కదా.. మరి అక్కడ రూ.4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. వాళ్లు నాలుగంటే నేను 5వేలు అనలేనా.. కానీ ఇదేమైనా వేలం పాటనా అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీది రాష్ట్రానికో నీతి అని.. అది ఏనాడూ ఇచ్చిన మాట నిలుపుకోదని కేసీఆర్ చెప్పారు. సమయం వచ్చినప్పుడు తానే పెన్షన్ల పెంపును ప్రకటిస్తాని కేసీఆర్ అన్నారు. సూర్యపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు కల్లాల దగ్గర అడుక్కోవడానికి వచ్చినట్లు.. కొంత మంది వస్తారు. తమకు అధికారం ఇస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుంటారు. వాళ్లేమైనా కొత్తవాళ్లా.. గతంలో అధికారంలో ఉన్నోళ్లే కదా అని కేసీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేయడానికి మళ్లీ వస్తున్నాయని.. కానీ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, సబ్సిడీ ధరలకు విత్తనాలు ఇవ్వడమే కాకుండా.. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల ద్వారా మూడు పంటలకు నీళ్లు అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కాలువలపైన ఎన్ని మోటార్లు పెట్టినా ఏమీ అనవద్దని అధికారులకు చెప్పాము. అందుకే ఈ రోజు దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేసీఆర్ చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఒకరేమో బావి దగ్గర మీటర్లు పెట్టమని అంటుంటే.. ఇంకొకరు మూడు గంటల విద్యుత్ సరిపోదా అని అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే.. ఇప్పుడు అక్కడ కూడా కరెంటు కోతలు షురూ అయ్యాయని కేసీఆర్ అన్నారు. బెంగళూరు నగరంలో కూడా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఎన్నో చెప్పిన కాంగ్రెస్.. గెలవగానే అన్ని మాటలను పక్కన పెట్టేసిందని కేసీఆర్ చెప్పారు. 24 గంటల విద్యుత్ ఇచ్చే మన ప్రభుత్వం కావాలా.. కరెంటు కోతల కాంగ్రెస్‌ను మళ్లీ తెచ్చుకుంటారో తేల్చుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తాం అని చెబుతోంది. అసలు ధరణి అంటే ఏంటో ఎవరికైనా తెలుసా? ఒక నాడు రైతు భూమి అమ్మాలన్నా, కొనాలన్నా ఎంతో మంది చుట్టూ తిరగాల్సి వచ్చేది. వీఆర్ఏ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ ఉండే మంత్రుల వరకు ఎవరికి కోపం వచ్చినా..మన భూమికి కొర్రీలు పెట్టేవాళ్లు. కానీ ఈ రోజు మీ బొటన వేలే మీ భూమికి అండగా, భద్రతగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. మీ భూమిపై ఎవరి పెత్తనం ఉండకుండా.. మీరే అధికారిగా ఉండే హక్కును ధరణి ద్వారా కల్పించామని అన్నారు. ధరణి ఉండటం వల్లే రైతు బంధు, రైతు బీమా వస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి ధరణి ఉండాలా లేదా అని ప్రజలను అడిగారు.

కాంగ్రెస్ పాలనలో సూర్యాపేట ప్రజలు మురికి మూసీ నది నీళ్లు తాగి రోగాల బారిన పడే వారు. కానీ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పుడు పాలధార లాంటి మంచి నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. గ్రామాల్లో కూడా పంచాయతీలకు భారం లేకుండా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని చెప్పారు. ఇటీవల పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నాయకుడు ఒకరు సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని నిరూపిస్తారా అని అంటున్నారు. మరి సూర్యాపేటకు కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్‌పీ నీళ్లు కాకుండా ఇంకే నీళ్లు వస్తున్నాయో ఆయనకే తెలియాలంటూ మల్లు భట్టి విక్రమార్కను పరోక్షంగా విమర్శించారు. సూర్యాపేట జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. దీంతో పంటలు కూడా బాగా పండుతున్నాయని చెప్పారు.

దామరచర్ల దగ్గర రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పూర్తయితే.. ఉమ్మడి నల్గొండ జిల్లా స్వరూపమే మారిపోతుందని కేసీఆర్ చెప్పారు. సూర్యాపేట ఇంతలా మారుతుందని.. అసలు జిల్లా అవుతుందని ఏనాడైనా ఊహించామా? ఆనాడు ఇక్కడి నుంచి ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు ప్రాతినిథ్యం వహించారు. ఏనాడైనా జిల్లా అభివృద్ధిని వారు కోరుకున్నారా అని ప్రశ్నించారు. రైతులకు రూ.37వేల కోట్ల మేర రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే అని కేసీఆర్ చెప్పారు.

ఎన్నికలు వచ్చే సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్లు చాలా మంది వస్తారు. కానీ ప్రజలు విజ్ఞతతో, ఆలోచించి మీ ఓటు వేసుకోవాలని కేసీఆర్ చెప్పారు. ఓటు అనేది గొప్ప ఆయుధం. దీని వల్ల మన తలరాతలే మారుతాయి. కాబట్టి ఈ విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటి అభివృద్ధి కొనసాగాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను మీరు వెళ్లి మీ ఊర్లలో చెప్పాలని ప్రజలను కోరారు.

సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు..

సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలను సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నానని కేసీఆర్ చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు.. మిగిలిన మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేటలో ఒక కళాభారతి కావాలని మంత్రి కోరారు. ఆయన అడిగినట్లుగానే కళాభారతి కోసం రూ.25 కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నాను. కొత్తగా కట్టిన కలెక్టరేట్, ఎస్పీ భవనాలకు ధీటుగా కళాభారతిని నిర్మించాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు.

మహిళా పాలిటెక్నిక్ కోసం కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని.. రాబోయే రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. స్థానికంగా ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ మంజూరు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. 

Tags:    
Advertisement

Similar News