రివెంజ్‌ పాలిటిక్స్‌ తో కాంగ్రెస్‌ పార్టీకి చేటే

ఏదో ఒక రోజు బాధపడక తప్పదని గుర్తించాలి : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Advertisement
Update:2025-01-20 20:24 IST

రివెంజ్‌ పాలిటిక్స్‌ తో కాంగ్రెస్‌ పార్టీకి చేటేనని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుండబద్దలు కొట్టారు. సోమవారం గాంధీ భవన్‌ లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ చేశారు. ఏ పార్టీ అయినా కక్షసాధింపు రాజకీయాలు చేయడం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజల రక్తంలోనే కక్షసాధింపు గుణమే ఉండదన్నారు. అలాంటప్పుడు కక్షసాధింపు రాజకీయాలను ప్రజలు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రివెంజ్‌ పాలిటిక్స్‌ చేయలేదన్నారు. తాను కూడా రివెంజ్‌ పాలిటిక్స్‌ కు వ్యతిరేకమని.. రాజకీయంగా యుద్ధం చేస్తానే తప్ప రివెంజ్‌ పాలిటిక్స్‌ ఎప్పటికీ చేయబోనన్నారు. రివెంజ్‌ పాలిటిక్స్‌ చేసే రాజకీయ నాయకులు ఏదో ఒక రోజు బాధపడక తప్పదని హెచ్చరించారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా తాను ఓడిపోవడానికి హరీశ్‌ రావే కారణమన్నారు. ఆయన సిద్ధపేట ఎమ్మెల్యేగా గెలవడానికి ఎంత కష్టపడ్డారో సంగారెడ్డిలో తనను ఓడించడానికి ఎంతే శ్రమించారని తెలిపారు. ఆయన రాజకీయ వ్యూహం పన్ని తన గెలుపు అవకాశాలను దెబ్బతీశారని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల వేళ జగ్గారెడ్డి కామెంట్స్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి.

Tags:    
Advertisement

Similar News