కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను బంగారు బాతులా ఉపయోగించుకుంటోంది

ప్రాజెక్టుల అంచనాలు రేవంత్‌ రెడ్డి ఇంట్లో తయారవుతున్నయ్‌

Advertisement
Update:2024-11-08 17:45 IST

తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ బంగారు బాతులా ఉపయోగించుకుంటోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మేడె రాజీవ్‌ సాగర్‌ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సంపదను దోచుకొని ప్రభుత్వం ఏఐసీసీకి పంపుతోందన్నారు. హర్యానా ఎన్నికలకు ఇక్కడి నుంచే డబ్బులు పంపారని, మహారాష్ట్రకు తెలంగాణ నుంచే డబ్బులు వెళ్తున్నాయని తెలిపారు. బిల్డర్లు, వ్యాపారులను బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. మొత్తం కార్యకలాపాలన్నీ రేవంత్‌ రెడ్డి ఇంటి నుంచే సాగుతున్నాయని, ప్రాజెక్టుల అంచనాలు సైతం రేవంత్‌ ఇంట్లోనే తయారు చేస్తున్నారని తెలిపారు. ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తాయో.. వాటిపైనే రేవంత్‌ దృష్టి పెడుతున్నాడని తెలిపారు. హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సుంకిశాల నిర్మాణంలో నాణ్యత లోపాలు జరిగితే వర్క్‌ ఏజెన్సీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మేఘా కృష్ణారెడ్డిని రేవంత్‌ గతంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అన్నారని.. ఇప్పుడు అదే కంపెనీకి పనులు కట్టబెడుతున్నారని తెలిపారు. రేవంత్‌ చేసే అవినీతిని బయట పెడుతామన్నారు. మేఘా కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌ చేసే వరకు పోరాడుతామన్నారు. కుల గణన పేరుతో అవసరం లేని సమాచారం సేకరిస్తున్నారని, బీసీల లెక్క తేల్చేందుకు సర్వే చేస్తున్నట్టుగా లేదన్నారు. ఈ సర్వేతో ఉన్న పథకాలు పోతాయనే భయం ప్రజల్లో నెలకొందన్నారు.

కేసీఆర్‌ సమగ్ర కుటుంబ సర్వే చేయించినప్పుడు రేవంత్‌ రెడ్డి వ్యతిరేకించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న సర్వే పై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. 11 నెలల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క మంచి పని చేయలేదన్నారు. కేసులు పెడతామన్న మంత్రుల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. రాహుల్‌ గాంధీ అదానీపై ఆరోపణలు చేస్తే.. అదే అదానీ ద్వారా రేవంత్‌ బీజేపీకి దగ్గరయ్యారని ఆరోపించారు. తెలంగాణలో భూములను అదానీకి కట్టబెడుతున్నారని అన్నారు. అదానీ ద్వారానే తెలంగాణ డబ్బులు ఢిల్లీలోని కాంగ్రెస్‌, బీజేపీలకు వెళ్తున్నాయని అన్నారు. బండి సంజయ్‌ కేంద్ర మంత్రి అన్న సోయి మరిచి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంజయ్‌ మోదీ ఫొటోతో రెండు సార్లు ఎంపీ అయ్యారని.. ఆయన రేవంత్‌ కు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ పొత్తుతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. బండి సంజయ్‌ కు కనీస జ్ఞానం లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాఖలపై విచారణ చేసి ఏం తేల్చారో చెప్పాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీని అమలు చేయాలని బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. పొంగులేటికి రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్‌, కేటీఆర్‌ అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్‌ ను ఏమీ చేయలేరని.. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News