ఎన్నికల వేళ కాంగ్రెస్ కి ఇన్ కమింగ్.. ఔట్ గోయింగ్
ఒకరి చేరికతో పార్టీ బలపడుతుంది అనుకుంటే, అదే సమయంలో మరొకరు చేజారుతున్నారు.
తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి చేరికలు కనపడుతున్నా.. అదే సమయంలో అసంతృప్తులు కూడా పార్టీని వీడుతుండటం విశేషం. ఒకరి చేరికతో పార్టీ బలపడుతుంది అనుకుంటే, అదే సమయంలో మరొకరు చేజారుతున్నారు. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని.. అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి తెలిపారు.
కసిరెడ్డి ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు కల్వకుర్తి సీటుపై హామీ లభించినట్టు తెలుస్తోంది. ఇక నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే మైనంపల్లి ఫ్యామిలీ కాంగ్రెస్ లో చేరి టికెట్లు ఖరారు చేసుకోవడం తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కూడా కొనసాగుతోంది. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
మల్కాజ్ గిరి టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ కూడా పార్టీకి దూరమవుతారనే ప్రచారం ఉంది. అక్కడ మైనంపల్లికి కాంగ్రెస్ టికెట్ ఖాయమైంది. కష్టకాలంలో కాంగ్రెస్ తో ఉండి పార్టీని కాపాడుకున్నామని, ఇప్పుడు వలస నేతలకు టికెట్లు ఇస్తూ, నమ్ముకున్నవారిని మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అసంతృప్త నేతలు.
బీసీల లొల్లి..
అటు బీసీ నేతలు కూడా కాంగ్రెస్ పై గరంగరంగా ఉన్నారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో రెండు సీట్లు బీసీలకు కేటాయించాలనేది వారి డిమాండ్. కానీ ఫైనల్ గా బీసీల కోరిక నెరవేరేలా లేదు. కొత్తగా వస్తున్నవారికి టికెట్లు ఖాయమైపోతున్నా.. బీసీల విషయంలో మాత్రం నిర్ణయం తేలలేదు. బీసీలకు కనీస టికెట్లు ఇవ్వకపోతే.. మరికొంతమంది కాంగ్రెస్ ని వీడే అవకాశముంది.