రెంటికి చెడ్డ రేవడిలా.. షర్మిల!

రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంతో చర్చలు కూడా జరిపారు. కానీ విలీనం దిశగా ఇప్పటివరకు ఎలాంటి అడుగూ పడలేదు.

Advertisement
Update:2023-09-27 07:03 IST

తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌టీపీని ఏర్పాటు చేసిన షర్మిల.. పార్టీని బలోపేతం చేయాలని పాదయాత్ర కూడా నిర్వహించి గట్టిగానే శ్రమించారు. అయితే ప్రజల్లో ఆమె పార్టీ పట్ల ఆసక్తి మాత్రం పెద్దగా ఏర్పడలేదన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను సింగిల్‌గా ముందుకెళితే.. ఏమాత్రం ఉపయోగం ఉండదని క్లారిటీకి వచ్చేసిన షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమైపోయారు. తద్వారా కాంగ్రెస్‌లో కీలకంగా మారి రాజకీయంగా ఎదగాలని భావించినట్టున్నారు.

ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంతో చర్చలు కూడా జరిపారు. కానీ విలీనం దిశగా ఇప్పటివరకు ఎలాంటి అడుగూ పడలేదు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌ పార్టీ పిలుపు కోసం ఎదురుచూసే స్థితిలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి సెప్టెంబరు 30 వరకు ఎలాంటి ప్రకటనా రాకపోతే తమ పార్టీ ఒంటరిగానే ముందుకెళుతుందని స్పష్టం చేశారు.

ఈ అంశంపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు విషయమై షర్మిల తొందరపడ్డారని అంచనా వేస్తున్నారు. అటునుంచి తనకు సానుకూలంగా నిర్ణయం వచ్చేవరకు వేచిచూడకుండా.. ముందుగానే కాంగ్రెస్‌లో చేరాలనే అభిప్రాయాన్ని బయటికి వెల్లడించడం ద్వారా ఆమె తన పార్టీని తానే బలహీనపరుచుకున్నట్టయిందని చెబుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌టీపీలో కీలక నేతలు పెద్దగా లేకపోగా.. ఉన్న కేడర్‌ కూడా పార్టీ విలీనం అవుతోందనే సమాచారంతో స్తబ్దుగా ఉండిపోయారు.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నుంచి సానుకూలత రాకపోతే ఒంటరిగానే ముందుకెళతామంటున్న షర్మిల.. ప్రజల్లో ఏమేరకు ఆదరణ తెచ్చుకోగలుగుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు పార్టీ బలహీనంగా మారడం.. ఇటు కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో షర్మిల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News