బొంతు రామ్మోహన్‌కి 'చే' ఇచ్చిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఈ వరుసలో ముందున్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు నేతలకు షాకిచ్చింది ఆ పార్టీ. ఎంపీ టికెట్ ఆశ చూపి ఇద్దరు నేతలను పార్టీలో చేర్చుకున్న హస్తం పార్టీ ఆ ఇద్దరు నేతలకు హ్యాండిచ్చింది. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు.. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోరకుంట వెంకటేశ్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఈ వరుసలో ముందున్నారు. ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పెద్దపల్లి ఎంపీ టికెట్‌పై కాంగ్రెస్ పెద్దలు తనకు హామీ ఇచ్చారని ప్రచారం చేసుకున్నారు. కానీ, తాజాగా ప్రకటించిన లిస్టులో పెద్దపల్లి ఎంపీ టికెట్‌ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకి ఇచ్చింది కాంగ్రెస్. దీంతో వెంకటేశ్ నేత షాక్‌లో ఉన్నారని సమాచారం.
ఇక హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ది ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ లేదా మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఆశించారు బొంతు. పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తర్వాత సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానంటూ సన్నిహితుల దగ్గర ప్రచారం చేసుకున్నారు. పలు చోట్ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ, చివరకు బొంతుకు హ్యాండిచ్చింది కాంగ్రెస్. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకుని.. ఆయనను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది.