ఖమ్మంలో కాంగ్రెస్‌ ఓవర్‌లోడ్‌.. తలనొప్పిగా మారిన అభ్యర్థుల ఎంపిక..?

తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

Advertisement
Update:2023-09-24 07:40 IST

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ వింత సమస్యను ఎదుర్కొంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు లాంటి పెద్ద నాయకుల చేరికతో పార్టీ ఓవర్‌లోడ్‌ అయినట్లుగా కనిపిస్తోంది. పొంగులేటి, తుమ్మల మద్దతుదారులు కూడా రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సీఎల్పీ భట్టి విక్రమార్క ఉండగా ఆయన అనుచరులు సైతం ఈసారి బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ కేటాయించాలనేది పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో అభ్యర్థుల గెలుపు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని స్క్రీనింగ్ కమిటీ ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాలను గెలుస్తామని ఏఐసీసీతో పాటు టీపీసీసీ ఆశలు పెట్టుకున్నాయి.

తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈ ఇద్దరు నేతల మద్దతుదారులకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని.. వారి అవసరమైన చోట వారి సహాయం తీసుకుంటామని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలుండగా.. కేవలం మూడు మాత్రమే జనరల్ సీట్లు. రెండు ఎస్సీ రిజర్వ్‌డ్‌ కాగా మిగతా ఐదు ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు. ఇక ఇటీవల పార్టీలో చేరిన నేతలు ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు జనరల్ స్థానాల నుంచి పోటీ చేయాల్సి ఉండగా.. పలువురు కాంగ్రెస్‌ సీనియర్లు కూడా ఆ స్థానాల నుంచే టికెట్లు ఆశిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సీట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నుంచి.. తుమ్మల ఖమ్మం నుంచి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అనుచరుల నుంచి ఈ ఇద్దరు నేతలపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. దీంతో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారి కారణంగా తమ అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు.

టీపీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వర్‌ పాలేరు టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి చేరికలు ఎక్కువ కావడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ పరిస్థితిని బీఆర్ఎస్‌ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. అసంతృప్త నేతలను తమవైపు లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్‌ సత్తుపల్లి నుంచి టికెట్ ఆశిస్తుండగా.. పొంగులేటి, తుమ్మల అనుచరులు సైతం సత్తుపల్లిపై కన్నేశారు. శ్రీనివాస రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన తెల్లం వెంకట్రావు భద్రాచలం టికెట్‌ దక్కదని తెలియడంతో తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు.

ఇక గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు పార్టీలో చేరడంతోఈ సారి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Tags:    
Advertisement

Similar News