కే.కే స్థానంలో రాజ్యసభకు సింఘ్వి.. కాంగ్రెస్ అధికారిక ప్రకటన
సెప్టెంబర్ 3న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలో మను సింఘ్వి విజయం లాంఛనమే. 2026 ఏప్రిల్ వరకు ఎంపీగా కొనసాగనున్నారు సింఘ్వి.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత కె. కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభిషేక్ మను సింఘ్విని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణకు చెందిన వ్యక్తినే అభ్యర్థిగా ఎంపిక చేయాలన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిని హైకమాండ్ పక్కనపెట్టింది.
ఇక ఈ ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇవాల్టి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 27 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. సెప్టెంబర్ 3న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలో మను సింఘ్వి విజయం లాంఛనమే. 2026 ఏప్రిల్ వరకు ఎంపీగా కొనసాగనున్నారు సింఘ్వి.
రాజస్థాన్‌కు చెందిన అభిషేక్ మను సింఘ్వి.. గతంలో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోయారు. ఫిబ్రవరి 27న హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అభిషేక్ మను సింఘ్వి, బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు చెరో 34 ఓట్లు వచ్చాయి. దీంతో లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేయగా.. సింఘ్వి ఓడిపోయారు.