గ్యాస్ గ్యారెంటీ భారం ఏడాదికి రూ.4913కోట్లు.. కాంగ్రెస్ వ్యూహం ఏంటి..?
ఈ పథకాన్ని ఎన్నిరోజులు వాయిదా వేస్తే ప్రభుత్వ ఖజానాకు అంత లాభం. అయితే అదే సమయంలో ప్రతిపక్షాలు గోల చేస్తాయి, ప్రజల్లో కాంగ్రెస్ చులకన అయిపోతుంది. అందుకే 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకుని పని మొదలు పెట్టారు.
ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలులో పెట్టి తమ హామీలను పట్టాలెక్కించింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నిటికంటే అతి ముఖ్యమైన, మహిళలపై నేరుగా ప్రభావాన్ని చూపే ఉచిత రవాణా తెలంగాణలో తొలి రోజునుంచే సంచలనంగా మారింది. మహిళలకు ఉపయోగపడే గ్యాస్ సిలిండర్ రాయితీని కూడా త్వరలో అమలు చేయాలని చూస్తున్నారు నేతలు. గ్యాస్ భారం పేదలపై పడకూడదు, అదే సమయంలో అనర్హులకు ఆ రాయితీ అందకూడదు.. అనే ఆలోచనతో నియమ నిబంధనలు రూపొందిస్తున్నారు.
ఆప్షన్ -1
తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి గ్యాస్ రాయితీ ఇవ్వడం. ప్రస్తుతం 89.99 లక్షల కుటుంబాలకు తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు రాయితీ ఇవ్వాలంటే ప్రభుత్వానికయ్యే ఖర్చు రూ.4913కోట్లు. అంటే ఆ కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందుతుంది. ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు జారీ చేస్తూ లబ్ధిదారుల సంఖ్య పెంచుకుంటూ పోతారు.
ఆప్షన్-2
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పేదవారిని వెదికి పట్టుకోవడం. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారిలో కూడా కొంతమంది అనర్హులున్నారు. అదే సమయంలో అర్హులకు కార్డులు అందని సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వడపోత పూర్తయితే లబ్ధిదారుల సంఖ్య పెరగకుండా పథకం అమలు చేయొచ్చు. కానీ దీనికి సమయం ఎక్కువపట్టే అవకాశముంది. పథకాన్ని ఎన్నిరోజులు వాయిదా వేస్తే ప్రభుత్వ ఖజానాకు అంత లాభం. అయితే అదే సమయంలో ప్రతిపక్షాలు గోల చేస్తాయి, ప్రజల్లో కాంగ్రెస్ చులకన అయిపోతుంది. అందుకే 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకుని పని మొదలు పెట్టారు. ప్రస్తుతానికి వివాదాల తేనె తుట్టెను కదపకుండా రేషన్ కార్డులు ఉన్నవారందరికీ ఈ పథకం అమలు చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది.