పథకాలు బాగున్నాయి.. ఆయన్ను చూసి నాకు మతిమరపు వచ్చింది

కేసీఆర్ కిట్ మంచి కార్యక్రమం అని ప్రశంసించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంచి స్కీములని అన్నారు. ఆ స్కీమ్ ల కింద మరో రెండు లక్షలు అదనంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు జగ్గారెడ్డి.

Advertisement
Update:2023-02-04 15:18 IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీఆర్ఎస్ పథకాలను మెచ్చుకుంటూనే ఆయన సభలో ఛలోక్తులు విసిరారు. ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. పథకాల అమలు తీరుపై సరైన నిఘా ఉండాలన్నారు. కొన్ని పథకాలు మంచివే అయినా అమలు తీరులో లోపాలున్నాయని చెప్పారు జగ్గారెడ్డి.

కేసీఆర్ కిట్ మంచి కార్యక్రమం అని ప్రశంసించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అదే సమయంలో క్యాన్సర్ పేషెంట్ల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా కుటుంబాలు అప్పులపాలవుతున్నాయని, వారికి తగిన సాయం అందించాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంచి స్కీములని అన్నారు. ఆ స్కీమ్ ల కింద మరో రెండు లక్షలు అదనంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు జగ్గారెడ్డి.

ఆయన మాటలు విని అంతా మరచిపోయా..

అసెంబ్లీలో మాట్లాడేందుకు తాను స్పీచ్ రాసుకుని వచ్చానని, కానీ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడే సరికి తాను చెప్పాల్సినదంతా మరచిపోయాని సెటైర్లు వేశారు జగ్గారెడ్డి. రాష్ట్రంలో సమస్యలేవీ లేవంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే వివేకానంద చెప్పడంతో తాను ఏ సమస్య గురించి మాట్లాడాలో మరచిపోయానన్నారు.

ఇవి కూడా చేయండి..

యాదాద్రికి మెట్రో రైల్ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు జగ్గారెడ్డి. నిరుద్యోగ భృతి గవర్నర్ ప్రసంగంలో రాలేదని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పేదవారికి 100 గజాల ఇంటి స్థలం ఇచ్చే జీవో మళ్ళీ తీసుకురావాలన్నారు. సంగారెడ్డి వరకు మెట్రో సౌకర్యం కల్పించాలని కోరారు. హైదరాబాద్ లో తరచుగా ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని.. వాళ్లు ఈడీ, ఐటీని పంపిస్తే.. మీరు టైమ్ చూసుకుని మా పైకి పోలీసులను పంపిస్తున్నారంటూ ఛలోక్తులు విసిరారు.

Tags:    
Advertisement

Similar News