అద్దంకికి మొండి చేయి.. కాంగ్రెస్ మార్కు రాజకీయం

అద్దంకి దయాకర్ పేరు తెరపైకి తేవడం ఎందుకు, చివరకు హ్యాండివ్వడం ఎందుకంటూ.. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు ఆయన అభిమానులు. హస్తం పార్టీ రాజకీయాలు ఇలాగే ఉంటాయని ఎత్తిపొడుస్తున్నారు వైరి వర్గం నేతలు.

Advertisement
Update:2024-01-17 17:28 IST

ఖాయంగా గెలిచే ఎమ్మెల్సీ సీట్లవి. అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తే వారిదే విజయం. అలాంటి స్థానంలో తన పేరు ప్రకటించే సరికి అద్దంకి దయాకర్ సంబరపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసినందుకు తగిన ప్రతిఫలం లభించిందని ఆనందపడ్డారు. అధిష్టానం తన మొర ఆలకించిందనుకున్నారు. కానీ గంటల వ్యవధిలోనే అతని ఆనందం ఆవిరైంది. సీటు లేదని అధిష్టానం తేల్చి చెప్పింది. ఆయన స్థానంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి అవకాశం ఇచ్చింది. చివరిగా మహేష్ కుమార్ గౌడ్ తోపాటు, బల్మూరి వెంకట్.. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు.

ఊరించి.. ఉసూరు మనిపించి

ప్రస్తుతం అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్‌ ఆశించారు. చివరకు ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మందుల సామియేలుకి టికెట్ ఇచ్చారు. ఆయన సునాయాస విజయం సాధించారు. తుంగతుర్తిలో పార్టీని బలోపేతం చేసిన అద్దంకి దయాకర్ కష్టానికి సామియేలుకు ప్రతిఫలం లభించినట్టయింది. 2014, 2018లో తుంగతుర్తి నుంచి దయాకర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. చివరకు కాంగ్రెస్ గెలిచే నాటికి ఆయనకు టికెట్ క్యాన్సిల్ అయింది. అయినా పార్టీకోసం ఆయన తన సీటు త్యాగం చేశారు. పార్టీని ఏమాత్రం తప్పుబట్టలేదు. అధిష్టానానికి తన విధేయత చూపించారు. చివరకు ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కూడా అద్దంకికి దక్కకుండా పోవడం విశేషం.

కాంగ్రెస్ మార్కు రాజకీయం..

అద్దంకి దయాకర్ పేరు తెరపైకి తేవడం ఎందుకు, చివరకు ఆయనకు హ్యాండివ్వడం ఎందుకంటూ.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు అద్దంకి దయాకర్ అభిమానులు. హస్తం పార్టీ రాజకీయాలు ఇలాగే ఉంటాయని ఎత్తిపొడుస్తున్నారు వైరి వర్గం నేతలు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కోటాలో ఆయనకు సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న బల్మూరి వెంకట్ కి అధిష్టానం చిన్న వయసులోనే లక్కీ ఛాన్స్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు గురువారంతో ముగుస్తుంది. 29వ తేదీన రెండు స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్‌ నిర్వహించి.. విజేతలను ప్రకటిస్తారు. రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కే ఖాయం అవుతాయి.

Tags:    
Advertisement

Similar News