30చోట్ల 'హ్యాండ్' ఇచ్చారు.. హస్తంలో తీవ్ర అసంతృప్తి

రెండో జాబితా విడుదల తర్వాత ఈ గొడవలు మళ్లీ జరిగే అవకాశముంది. అందుకే కొన్నిరోజులు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి తాళం వేస్తారని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

Advertisement
Update:2023-10-28 09:43 IST

కాంగ్రెస్ పార్టీ రెండు విడతల్లో 100 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో 30మంది పక్క పార్టీలనుంచి వచ్చినవారు ఉండటం విశేషం. అంటే ఆ 30చోట్ల టికెట్ పై ఆశ పెట్టుకున్నవారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొంతమంది ఆల్రడీ పార్టీ మారారు, సెకండ్ లిస్ట్ తో షాకయిన మరికొందరు ఆ ఆలోచనలోనే ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ ని నమ్ముకుని ఉన్నవారికంటే సడన్ గా గోడదూకినవారికే అధిష్టానం ప్రయారిటీ ఇవ్వడం ఇక్కడ విశేషం.

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ తో అసంతృప్తి జ్వాలలు బయటపడ్డాయి. సెకండ్ లిస్ట్ తో అవి మరింత ఎగసిపడ్డాయి. మొత్తం 100మందిలో 30మంది బయటివారు కాగా.. అందులో 19మంది ఇలా వచ్చి అలా సీటు తెచ్చుకున్న వారు ఉన్నారు. అంటే వీరు కేవలం టికెట్ హామీతోనే పార్టీలో చేరారు, మాట నెగ్గించుకున్నారు. తుమ్మల, పొంగులేటి, మైనంపల్లి, కోమటిరెడ్డి.. ఇలా ఈ జాబితా లో 19మంది ఉన్నారు. వీరందరికీ టికెట్లు రావడంతో పార్టీకోసం కష్టపడినవారు రగిలిపోతున్నారు. ఇక ఎల్బీనగర్ లాంటి చోట్ల... నియోజకవర్గానికి సంబంధం లేని మధుయాష్కీ గౌడ్ లాంటివారికి టికెట్లు కేటాయించడంతో స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బీసీల సంగతేంటి..?

కాంగ్రెస్ లోని బీసీ నేతలు 34 స్థానాలు అడిగారు. ప్రకటించిన 100లో 20 సీట్లు బీసీలకు దక్కాయి. మిగతా 19 స్థానాల్లో బీసీలకు చోటు ఉంటుందని అనుకోలేం. అంటే తెలంగాణ కాంగ్రెస్ లో బీసీ కోటా 20 దగ్గరే ఆగిపోయింది. దీంతో బీసీలు కూడా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఆ 20లో కూడా కాంగ్రెస్ గ్యారెంటీగా ఓడిపోయే స్థానాలు ఉండటం విశేషం.

గాంధీ భవన్ కి తాళం వేస్తారా..?

తొలి జాబితా విడుదల తర్వాత అసంతృప్తులు గాంధీ భవన్ ముందు నిరసనలు తెలిపారు. ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లను అడ్డుకున్నారు. టికెట్లు అమ్ముకున్నారంటూ రచ్చ చేశారు. మనకెందుకీ గొడవ అనుకున్నవారు సైలెంట్ గా పార్టీ మారారు. రెండో జాబితా విడుదల తర్వాత ఈ గొడవలు మళ్లీ జరిగే అవకాశముంది. అందుకే కొన్నిరోజులు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి తాళం వేస్తారని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News