ఖమ్మం కాంగ్రెస్ భేటీకి బీసీ సెగ.. వీహెచ్‌ను నిలదీసిన ఆశావహులు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విజయభేరి సభ సన్నాహక సమావేశం మొదలవగానే కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు.
టీకాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయభేరి సభకు సన్నాహకంగా ఖమ్మంలో ఈ రోజు జరిగిన సమావేశం బీసీ లీడర్ల అరుపులు, కేకలతో గందరగోళంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క సమక్షంలోనే బీసీ లీడర్లు నినాదాలతో హోరెత్తించి సమావేశాన్ని ఆగమాగం చేశారు. తమకు సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో నినాదాలిచ్చారు.
ఉమ్మడి జిల్లాలో బీసీలకు 2 సీట్లివ్వాలి
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విజయభేరి సభ సన్నాహక సమావేశం మొదలవగానే కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. సమావేశంలో ప్రసంగిస్తున్న వీహెచ్‌ను అడ్డుకున్నారు. బీసీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సీట్లు కేటాయించాలని నినాదాలు చేశారు. వారికి నచ్చజెప్పేందుకు వీహెచ్ ఎంత ప్రయత్నించినా వినలేదు. పదేపదే బతిమాలినా వినకపోవడంతో వీహెచ్ ప్రసంగం ఆపేసి కూర్చుండిపోయారు.
భట్టి వాకౌట్
మరోవైపు రేణుక వర్గీయుల ఆందోళనతో భట్టి విక్రమార్క సభ నుంచి అర్ధాంతరంగా బయటకి వెళ్లిపోయారు. ఇటీవల పార్టీలోకి వచ్చి కీలకంగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రభసను చూస్తూ ప్రేక్షకుడిలా మిగిలిపోయారు. ఇలా ఎవరికి వారే వర్గాలుగా ఉండటంతో ఖమ్మంలో కాంగ్రెస్ టికెట్లు ప్రకటించకముందే తీవ్ర గందరగోళానికి గురవుతోంది.