స్థాయీ సంఘం ఎన్నికలతో జీహెచ్ఎంసీలో పాగాకు కాంగ్రెస్ ప్రయత్నాలు
జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్లంతా కలిసి 15 మంది సభ్యుల స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటారు. 15 నామినేషన్లు పడితే ఏకగ్రీవమవుతారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా ప్రభావం చూపినా జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కాంగ్రెస్ కుదేలయింది. అప్పటి నుంచి కాంగ్రెస్ నేతల దృష్టంతా హైదరాబాద్ నగరం మీదే ఉంది. మూడేళ్ల కిందట జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండే డివిజన్లు గెలిచిన కాంగ్రెస్, బలం పెంచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. మార్చి 7న జరగనున్న స్థాయీ సంఘం ఎన్నికల ద్వారా నగరపాలికలో ఎలాగైనా పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఏకగ్రీవంగా కాకుండా చూడాలన్నదే లక్ష్యం
జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్లంతా కలిసి 15 మంది సభ్యుల స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటారు. 15 నామినేషన్లు పడితే ఏకగ్రీవమవుతారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 కార్పొరేటర్లను గెలిపించుకోగలిగాయి. కాంగ్రెస్ 2 డివిజన్లలో మాత్రమే గెలిచింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఇందులో మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కీలకం. ఇక ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈరోజో రేపో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం. వీరు తమతోపాటు కొంత మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్‌లోకి తెస్తారని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే తమవారిని కొంతమందిని స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు వేయించాలన్నది లక్ష్యం. అయితే ఏకగ్రీవంగా లేదంటే ఎన్నిక పెట్టించయినా సరే స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ వారుండాలన్నది ఆ పార్టీ లక్ష్యం.
ఏ పనికి అయినా వారిదే తొలి ఆమోదం
జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం రూ.2కోట్ల లోపున్న పనులయితే జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ నిర్ణయం తీసుకుని చేయించేయవచ్చు. రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉన్న పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి. ఇదే కాదు స్టాండింగ్ కమిటీ మేయర్ అధ్యక్షతన సమావేశమై అవసరమైన పనులు, సమస్యల పరిష్కారంపై చర్చిస్తుంది. స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందాకే ప్రతిపాదనలు కార్పొరేషన్ సమావేశంలో చర్చకు వస్తాయి. ఇంత కీలకమైనది కాబట్టే స్టాండింగ్ కమిటీ నుంచే జీహెచ్ఎంసీలో పాగా వేయాలని కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోంది.