బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ కులగణన జపం
బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడిన కేటీఆర్
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఏడాది అయ్యిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. హనుమకొండలో నిర్వహించిన బీఆర్‌ఎస్ నేతల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారుల గొంతు కోశారని విమర్శించారు.
కొత్త పథకాల మాట దేవుడెరుగు.. ఉన్న పథకాలకే పాతరేశారు. రేవంత్ ప్రభుత్వం రాగానే... బీసీ బంధు, రైతు బంధును బంద్ చేశారని ధ్వజమెత్తారు. బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ కులగణన జపం ఎత్తుకున్నది. కులగణనలో 175 ప్రశ్నలు అడుగుతున్నారని, బ్యాంకుల్లో పైసలు ఎన్ని ఉన్నాయి? ఏసీ ఉన్నదా? ఫ్రిజ్ ఉన్నదా? అని అడుగుతున్నారు. దీంతో కులగణనకు వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీసీల ఓట్ల కోసం ప్రభుత్వం అధికారులను బలి పశువులను చేస్తున్నది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. అవి ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా.. కాంగ్రెస్ ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఉండాలని గతంలో కేసీఆర్ కోరిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతల చిత్తశుద్ధిని ప్రజలు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన ప్రస్తావన తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు.