టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్.. కాంగ్రెస్ భారీ స్కెచ్.!
కాంగ్రెస్ ఇప్పటికే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది. అక్కడ తూంకుంట నర్సారెడ్డికి అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీష్, కేటీఆర్‌లపై పార్టీ అగ్రనేతలను బరిలో దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లను తమతమ నియోజకవర్గాలకే పరిమితం చేయాలనేది కాంగ్రెస్ ప్లాన్. ఇందుకోసం డబుల్ నామినేషన్ పద్ధతిని అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది హస్తం పార్టీ.
ఇందులో భాగంగా కామారెడ్డిలో కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హరీష్ రావుపై ఉత్తమ్‌కుమార్ రెడ్డిలను బరిలో దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే వీరి పేర్లు ఫస్ట్ లిస్ట్‌లో వచ్చాయి. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెంకట్ రెడ్డిలకు అవకాశం కల్పించింది కాంగ్రెస్. నవంబర్ 3న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఈ ప్లాన్‌పై మరింత స్పష్టత రానుంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 15 నామినేషన్ ఉపసంహరణకు చివరితేది.
కాంగ్రెస్ ఇప్పటికే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది. అక్కడ తూంకుంట నర్సారెడ్డికి అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే కామారెడ్డి నుంచి రేసులో ఉన్న షబ్బీర్ అలీ పేరును ఫస్ట్ లిస్ట్‌లో ప్రకటించలేదు కాంగ్రెస్. దీంతో పార్టీలో ఒక్కసారిగా ఊహగానాలు మొదలయ్యాయి. షబ్బీర్ అలీ ఎల్లారెడ్డి లేదా నిజామాబాద్ అర్బన్‌కు షిఫ్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది.
ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఇప్పటికే ఓ ఉపఎన్నికతో కలిపి నాలుగు సార్లు విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ లీడర్ కె.కె.మహేందర్ రెడ్డిపై 89 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. తమ ప్లాన్ వర్కవుట్ అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను తమ నియోజకవర్గాలకే పరిమితం చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్రనాయకత్వం మాత్రం ఈ ప్లాన్ బూమరాంగ్ అయ్యే అవకాశాలున్నాయని అధినాయకత్వాన్ని హెచ్చరిస్తుందట. ఇందుకు 2018లో రేవంత్, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, కోమటిరెడ్డి వరుసగా.. కొడంగల్, నల్గొండ, హుజూర్‌నగర్‌లో ఓడిపోయిన అంశాన్ని ఊదహరిస్తున్నారట. ఈ ప్లాన్‌పై పునరాలోచించాలని ఢిల్లీ పెద్దలను కోరుతున్నట్లు సమాచారం.