అన్నివర్గాలను కాంగ్రెస్‌ సక్సెస్‌ఫుల్‌ గా మోసం చేసింది

విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరపాలి : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-11-19 13:39 IST

రాష్ట్రంలోని అన్నివర్గాలను కాంగ్రెస్‌ పార్టీ సక్సెస్‌ ఫుల్‌ గా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు 'ఎక్స్‌' వేదికగా మండిపడ్డారు. 'ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డరు. రైతులు దారుణంగా మోసపోయారు. కాంగ్రెస్‌ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని.. వాళ్లు చేసుకోవాల్సింది అపజయోత్సవాలు అని అన్నారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదన్నారు. డిక్లరేషన్ లో చెప్పిన మొట్ట మొదటి హామీ 2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదని.. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసాకు దిక్కులేదన్నారు. ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తానని ఇవ్వలేదని. పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ ను బోగస్ చేశారని మండిపడ్డారు. ఆనాడు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు.

కాంగ్రెస్‌ పది నెలల పాలనలో అభివృద్ధి పదేండ్లు వెనక్కి వెళ్లిందని, కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.. వద్దురో నాయనా కాంగ్రెస్ పాలన అంటూ పాటలు పాడుకుంటున్నారు.. పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలు.. స్కాలర్ షిప్‌ల కోసం విద్యార్థులు.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు.. రుణమాఫీ, రైతుబంధు కోసం రైతులు.. జీతాల కోసం ఆశాలు, అంగన్ వాడీలు.. డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిధులు విడుదల చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బంది.. ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు.. ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా బాధితులు.. సమస్యలు పరిష్కరించాలంటూ పోలీసులు.. పింఛన్లు పెంచాలని వృద్ధులు ఇలా అందరినీ సీఎం రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ ఫుల్‌గా రోడ్ల మీదికి తెచ్చాడని అన్నారు. ఇకనైనా గోబెల్స్ ప్రచారాలు పక్కన బెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టాలని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినందుకు వరంగల్ వేదికగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News