మునుగోడు కోసం ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసిన కాంగ్రెస్
మునుగోడు నుంచి పోటీ చేసేందుకు నలుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి కలసి ఒక్కో అభ్యర్థిని ఇంటర్వ్యూ చేశారు.
కాంగ్రెస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానం మునుగోడును కాపాడుకోవడానికి ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో మాదిరిగా ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా.. సరైన అభ్యర్థి కోసం అన్ని రకాలుగా అన్వేషిస్తోంది. ఇప్పటి వరకు మునుగోడు నుంచి పోటీ చేసేందుకు నలుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. కాగా, గురువారం వారిని గాంధీభవన్‌కు పిలిపించి విడివిడిగా మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి కలసి ఒక్కో అభ్యర్థిని ఇంటర్వ్యూ చేశారు.
నలుగురు ఆశావహులతో చర్చించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్, చల్లమల్ల కృష్ణారెడ్డిలను తుది జాబితాకు ఎంపిక చేశారు. మునుగోడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచన పాల్వాయి గోవర్థన్ రెడ్డి వారసురాలిగా పాల్వాయి స్రవంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014లో కాంగ్రెస్ టికెట్ ఆశించినా.. పొత్తుల్లో భాగంగా అది సీపీఐకి దక్కడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో స్రవంతి 27,441 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 2018లో మరోసారి టికెట్ కోసం ప్రయత్నించినా.. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించింది.
ఇక ఇప్పుడు ఉపఎన్నిక సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. అయితే పాల్వాయి స్రవంతితో జరిగిన చర్చలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె వద్ద జవాబు లేనట్లు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో టికెట్ దక్కక పోవడంతో ఆమె నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మధ్యలో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించినా.. ఆమె నుంచి సరైన జవాబు రాలేదు. దీంతో స్రవంతిని పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది. టీపీసీసీ అధికార ప్రతినిధి పి. కైలాశ్ నేత అభ్యర్థిత్వంపై కూడా కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచి తీరుతానని.. ఏ మండలంలో ఎంత ఓటు బ్యాంకు ఉన్నది, తన బంధు వర్గం ఎక్కడెక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులుగా ఉన్నారో పల్లె రవికుమార్ వివరించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా తాను నియోజకవర్గంలో సుపరిచితుడినని.. తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. పల్లె రవికుమార్ ఇచ్చిన సమాధానాలకు కాంగ్రెస్ నాయకులు సంతృప్తి చెందినట్లు తెలుస్తున్నది. అయితే తెలంగాణ జన సమితి తరపున పల్లె రవి సోదరుడు పల్లె వినోద్ బరిలో దిగుతుండటమే ఆయనకు ఉన్న ఒకే ఒక మైనస్‌గా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
ఇక చల్లమల్ల కృష్ణారెడ్డి పేరును కూడా తుది జాబితాలో ఉంచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆయనకు రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడంపై తీవ్రమైన చర్చ జరిగింది. అంతే కాకుండా ఒక వేళ ఉపఎన్నికలో ఓడిపోతే కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగే అవకాశాలు లేనట్లుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుమానిస్తున్నారు. కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించడంపై మల్లు భట్టి విక్రమార్క, దామోదర్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. అయితే రేవంత్ రెడ్డి మొగ్గు చూపడంతోనే ఆయన పేరు తుది జాబితాలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఇద్దరి పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి పంపనున్నారు. అక్కడ సూచించే అభ్యర్థికి టికెట్ దక్కనున్నది.