రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోతే.. పక్కా ప్లాన్ రెడీ చేసిన కాంగ్రెస్.!

పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిని బరిలోకి దింపాలని భావిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ విషయంపై అధిష్టానంతో చర్చలు

Advertisement
Update:2022-07-26 12:23 IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి పార్టీని వీడేది లేదని చెప్పినా.. ఒకటి రెండు నెలల్లోనే ఆయన బీజేపీ పంచన చేరడం ఖాయంగా మారింది. మునుగోడు నియోజకవర్గంలో తన అనుచరులతో భేటీ అయిన తర్వాత పార్టీ మారే తేదీని ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకొని వచ్చి.. ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేయించాలని భావిస్తున్నారు. మునుగోడులో గెలిస్తే అది 2023లో బీజేపీకి అనుకూలంగా మారుతుందని రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించబడిన దగ్గర నుంచి పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్న రాజగోపాల్.. తరచూ పార్టీకి, రేవంత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. మొదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్‌లో రాజగోపాల్ డిఫరెంట్‌ వ్యవహార శైలి కలిగి ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్నదే అతికొద్ది ఎమ్మెల్యేలు. దీంతో ఉన్న ఎమ్మెల్యేను పోగొట్టుకోవడం ఎందుకనే రీతిలో అధిష్టానం వ్యవహరించింది. కానీ ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోవడంతో పోతే పోనియ్ అనే ధోరణితో ఉంది.

కాగా, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఎలా వ్యవహరించాలనే విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ ఒక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మునుగోడుకు ఉపఎన్నిక వచ్చినా దీటుగా ఎదుర్కోవడానికి అభ్యర్థిని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిని బరిలోకి దింపాలని భావిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ విషయంపై అధిష్టానంతో చర్చలు జరిపారని, అటువైపు నుంచి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినా కాంగ్రెస్ క్యాడర్ బీజేపీలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. ఇందుకోసం స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన మునుగోడుపై కాస్త ఫోకస్ చేశారు. ఆ తర్వాత మునుగోడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఒక పదవి కోసమే మునుగోడును అంటి పెట్టుకొని ఉన్నారని.. అంతే కాని ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ లేదని స్థానిక నాయకత్వం కూడా వ్యాఖ్యానిస్తోంది.

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బీజేపీ తరపున ఈటల రాజేందర్ గెలిచిన మాదిరిగానే.. రాజగోపాల్ రెడ్డిని కూడా గెలిపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంపై రాజేందర్‌కు ఉన్న పట్టుతో పోల్చుకుంటే.. మునుగోడులో రాజగోపాల్‌కు ఉన్న ఆదరణ తక్కువే అని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. స్థానిక నాయకత్వం కూడా రాజగోపాల్‌కు సహకరించదని.. కాంగ్రెస్ తరపున ఎవరు నిలబడితే వారిని గెలిపించుకుంటారని అంచనా వేస్తోంది.

అందుకే కాంగ్రెస్ క్యాడర్ బీజేపీ వైపు వెళ్లకుండా రేవంత్ తనదైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. హుజూరాబాద్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో కాస్త డ్యామేజీ జరిగింది. ఈసారి మునుగోడులో అలా జరుగకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ సీటును ఉపఎన్నికలోనే కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోగొట్టుకోకూడదనే విధంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.

Tags:    
Advertisement

Similar News