వార్ రూమ్ పై దాడి.. కాంగ్రెస్ కట్టుకథ

గతంలో ఇదే వార్ రూమ్ పై అదే పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement
Update:2023-05-16 16:38 IST

తెలంగాణలో కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేశారంటూ హస్తం పార్టీ నేతలు చేసిన రాద్ధాంతం చివరకు ఓ కట్టుకథ అని తేలింది. తామెవరం ఆ వార్ రూమ్ వైపు వెళ్లలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఆ వార్ రూమ్ పై గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఫిర్యాదు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే ఈ వ్యవహారానికి అసలు కారణం అని తేలింది. కాంగ్రెస్ పరువు మరోసారి బజారున పడింది.

కర్నాటకలో ఇద్దరు నాయకుల్లో ఒకరిని సీఎంగా ఎంపిక చేయడానికి అధిష్టానం నానా తంటాలు పడుతోంది. ఒకవేళ తెలంగాణలోనే అలాంటి పరిస్థితి వస్తే గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా సీఎం సీటుకి గేలం వేస్తారు. అంతెందుకు పాదయాత్రల విషయంలోనే కాంగ్రెస్ లో ఏకాభిప్రాయం లేదు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరికింద ఇంకొకరు సైలెంట్ గా గోతులు తవ్వుతుంటారు. ఇలాంటి తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు కర్నాటక ఫలితాలు చూసి చంకలు గుద్దుకుంటోంది. అంతే కాదు.. కర్నాటక ఫలితాలతో బీఆర్ఎస్ కి భయం పట్టుకుందని, అందుకే తమ వార్ రూమ్ పై పోలీసులతో దాడి చేయించిందంటూ కాంగ్రెస్ నేతలు వితండవాదానికి దిగారు.

అసలేం జరిగింది..?

బంజారాహిల్స్‌ లోని తెలంగాణ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్‌ పై సైబరాబాద్ పోలీసులు దాడి చేసి కీలక డాక్యుమెంట్లు, ల్యాప్‌ టాప్‌ లు ఎత్తుకెళ్లారనేది ప్రధాన ఆరోపణ. ఇటీవల హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ప్రిపరేషన్ లో ఈ వార్ రూమ్ కీలకంగా ఉంది. ఆ అక్కసుతోనే తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించిందంటూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణల్లో అసలు వాస్తవమేంటో ఇప్పుడు బయటపడింది.

దాడి చేసింది ఎవరు..?

కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై దాడి చేసింది అసలు పోలీసులే కాదు. ఈ విషయాన్ని అటు బంజారాహిల్స్, ఇటు జూబ్లీ హిల్స్ పోలీసులు ధృవీకరించారు. అసలు దాడిలో పోలీసుల ప్రమేయం లేదని డిప్యూటీ కమీషనర్ జోయెల్ డేవిస్ స్పష్టం చేశారు. మరి దాడి చేసిందెవరు..? ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వార్ రూమ్ పై దాడి చేసి ల్యాప్ టాప్ లు, డేటా తీసుకెళ్లారు. ఆ వ్యక్తులు ఎవరనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ఉత్తమ్ ప్రమేయం ఉందా..?

గతంలో ఇదే వార్ రూమ్ పై అదే పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం తనపైనే తప్పుడు ప్రచారం చేస్తోందని సాక్షాత్తూ రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు ఫిర్యాదు చేయడం విశేషం. అయితే ఇప్పుడీ దాడిలో ఉత్తమ్ ప్రమేయం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దాడి వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్న తెలంగాణ కాంగ్రెస్.. ఇప్పుడిలా వార్ రూమ్ దాడి వ్యవహారంతో జనాల్లో మరింత పలుచన అవుతోంది. వార్ రూమ్ వ్యవహారంలో నాయకుల మధ్య సయోధ్య లేదనే విషయం తేలిపోయింది. దాడి చేసిందెవరనేదే ఇప్పుడు తేలాల్సిన విషయం. 

Tags:    
Advertisement

Similar News