గన్ పార్క్ కి కాదు రేవంత్.. ఇక్కడికి వచ్చి ప్రమాణం చెయ్
రేవంత్ రెడ్డిని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి పిలిస్తే, ఆయన గన్ పార్క్ వద్దకు వెళ్లి హడావిడి చేయడమేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ బహిష్కృత నేతలు.
ఈరోజు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద రేవంత్ రెడ్డి చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామంటూ ఆయన అధికార బీఆర్ఎస్ కి సవాల్ విసిరారు. గన్ పార్క్ వద్ద ప్రమాణం చేద్దాం రమ్మన్నారు. అన్నట్టుగానే ఈరోజు ఆయన గన్ పార్క్ కి వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎవరూ రాలేదని సెటైర్లు వేశారు. ఈలోగా పోలీసులు ఆయన్ని, కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ అసలు సీన్ గన్ పార్క్ వద్ద కాదని, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద అని ఆయనకు రివర్స్ లో సవాల్ విసురుతున్నారు ఆ పార్టీ బహిష్కృత నేతలు. నోటుకు సీటు వ్యవహారంలో డబ్బు ముట్టలేదని రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ సీటు విషయంలో అసంతృప్తితో ఉన్న రాగిడి లక్ష్మారెడ్డి సహా ఇతర నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు.
ఇక్కడికి పిలిస్తే అక్కడికెందుకు..?
రేవంత్ రెడ్డిని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి పిలిస్తే, ఆయన గన్ పార్క్ వద్దకు వెళ్లి హడావిడి చేయడమేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ బహిష్కృత నేతలు. సర్వేల్లో ముందున్న తమను కాదని, మరొకరి వద్ద డబ్బులు తీసుకుని టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కవర్ చేసుకోడానికే.. ఆయన గన్ పార్క్ వద్ద సీన్ క్రియేట్ చేశారని విమర్శించారు.
కేటీఆర్ కౌంటర్..
రేవంత్ రెడ్డి సవాల్ కి కేటీఆర్ గతంలోనే కౌంటర్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి మాటల్ని ఎవరైనా సీరియస్ గా ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించారాయన. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సన్నాసి మాటలకు విలువ ఏముంటుందన్నారు. తన నియోజకవర్గంలో డబ్బులు, మందు పంచిపెట్టనని తాను ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్.