రుణమాఫీ నిజమా, కాదా..? కాంగ్రెస్ లోనే గందరగోళం
కాంగ్రెస్ ట్వీట్ చూస్తే రుణమాఫీ సక్సెస్ కాలేదనే విషయం స్పష్టమవుతోంది. కానీ భట్టి మాత్రం రుణమాఫీ చేశామని ఘనంగా చెప్పుకుంటున్నారు. ఇందులో ఏది నిజం..? ఏది అబద్ధం..? రోడ్డెక్కిన అన్నదాతలకు ఏంటి సమాధానం..?
రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మూడు విడతల్లో మాఫీ చేసినట్టు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది మాఫీ కాదు, పాక్షిక మాఫీ అని అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. రైతులు కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహం చాలా గ్రామాల్లో రోడ్లపై కూడా కనపడుతోంది. అయితే కాంగ్రెస్ లో మాత్రం రుణమాఫీపై ఇంకా గందరగోళం నెలకొని ఉంది. కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండటమే దీనికి రుజువు.
రుణమాఫీ చేసేశాం..
కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అని రుణమాఫీ అమలతో మరోసారి రుజువైందని చెప్పారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేశామన్నారాయన. మాట ఇచ్చాం - మాఫీ చేశామంటూ ఓ ట్వీట్ పెట్టారు.
ఇక కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతానుంచి మరో ట్వీట్ వచ్చింది. రుణమాఫీ కాని రైతులకోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోందనేది దాని సారాంశం. మాఫీ కాని రైతులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చారు. ఆధార్ కార్డ్ లో తప్పులుంటే ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫై చేస్తామన్నారు. అసలు, వడ్డీ లెక్కలు సరిపోలకపోతే నిర్థారణ, దిద్దుబాటు చర్యలు చేపడతామన్నారు. ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తామని, కొత్తగా మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పుకొచ్చారు.
ఇక్కడ కాంగ్రెస్ ట్వీట్ చూస్తే రుణమాఫీ సక్సెస్ కాలేదనే విషయం స్పష్టమవుతోంది. కానీ భట్టి మాత్రం రుణమాఫీ చేశామని ఘనంగా చెప్పుకుంటున్నారు. ఇందులో ఏది నిజం..? ఏది అబద్ధం..? రోడ్డెక్కిన అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏంటి సమాధానం..?