కుల గణన ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ఇందులో పాల్గొనాలి.. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

Advertisement
Update:2024-10-30 15:03 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే బీసీ కుల గణనను ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. బుధవారం కుల గణనపై గాంధీ భవన్‌ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌, ముఖ్య నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్రలోనే కుల గణనపై స్పష్టమైన ప్రకటన చేశారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. నవంబర్‌ రెండో తేదీన కులగణనపై అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు కుల గణనపై సందేహాలు నివృత్తి చేసేందుకు గాంధీ భవన్‌ లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

నవంబర్‌ 6 నుంచి కులగణన : మంత్రి పొన్నం ప్రభాకర్‌

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌, కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా నవంబర్‌ 6వ తేదీ నుంచి రాష్ట్రంలో సమగ్ర కుల గణన ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు. ఈ సర్వే సక్రమంగా పూర్తయ్యేలా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కులగణనపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి 150 ఇండ్ల నుంచి సమాచారం సేకరించేలా ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News