పటేల్ దేవుడు, సోనియా దేవత.. మరి కేసీఆర్ ఎవరు..?
తెలంగాణకోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన కేసీఆర్ ని ఏమనాలి..? ఆమరణ దీక్ష చేపట్టి, కేంద్రం మెడలు వంచి, అందరిలో ఆలోచన రేకెత్తించి, తెలంగాణ అసాధ్యం అన్న నోళ్లే.. అనివార్యం అనేలా చేసిన కేసీఆర్ కి ఎంత క్రెడిట్ ఇవ్వాలి..? ఆయన్ను ఎన్నిసార్లు సీఎంని చేసుకోవాలి..?
సెప్టెంబర్-17 తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతున్న బీజేపీ, తెలంగాణ ప్రాంతానికి పటేల్ దేవుడంటూ కొత్త పల్లవి అందుకుంది. పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. అలనాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని గుర్తు చేశారు. ఆయనే లేకపోతే నిజాం పాలన నుంచి తెలంగాణకు అంత త్వరగా విముక్తి లభించేది కాదన్నారు. వల్లభాయ్ పటేల్ చొరవతోనే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాలను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సోనియా దేవత -కాంగ్రెస్
నిన్నటినుంచి హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటుకి సోనియా కారణం అంటూ కాంగ్రెస్ నాయకులు జబ్బలు చరుచుకున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది కాంగ్రెస్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు గతంలోనే కౌంటర్లిచ్చారు మంత్రి కేటీఆర్. బ్రిటిష్ పాలన నుంచి భారత్ కు స్వాతంత్రం వచ్చినట్టు, తెలంగాణను ఇచ్చింది సోనియా అని చెప్పుకోవడం సిగ్గుచేటని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ పోరాటం తుది దశకు చేరుకున్న వేళ, అనివార్య పరిస్థితుల్లో ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని అంటున్నారు.
మరి కేసీఆర్ ని ఏమనాలి..?
స్వాతంత్రం సిద్ధించిన తర్వాత విడిగా ఉంటున్న ఒక్కొక్క సంస్థానాన్ని స్వతంత్ర భారత్ లో కలిపిన అప్పటి హోం మంత్రి పటేల్ హైదరాబాదా సంస్థానానికి దేవుడయితే, తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటుకి అనుమతిచ్చిన సోనియా ఈ ప్రాంతానికి దేవత అయితే.. మరి తెలంగాణకోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన కేసీఆర్ ని ఏమనాలి..? ఆమరణ దీక్ష చేపట్టి, కేంద్రం మెడలు వంచి, అందరిలో ఆలోచన రేకెత్తించి, తెలంగాణ అసాధ్యం అన్న నోళ్లే.. అనివార్యం అనేలా చేసిన కేసీఆర్ కి ఎంత క్రెడిట్ ఇవ్వాలి..? అరవయ్యేళ్లలో సాధ్యంకాని అభివృద్ధిని తెలంగాణ ఏర్పడిన పదేళ్లలోపే చేసి చూపించిన కేసీఆర్ ని ప్రజలు ఎన్నేళ్లు గుర్తు పెట్టుకోవాలి..? ఆయన్ను ఎన్నిసార్లు సీఎంని చేసుకోవాలి..? ఆకలి వేసినప్పుడు అన్నంపెట్టనివాళ్లంతా ఎన్నికలప్పుడు గోరుముద్దలు పెడతామంటున్నారని ఇటీవల హరీష్ రావు చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇక్కడ సీడబ్య్లూసీ మీటింగ్ పెట్టుకుంది, సెప్టెంబర్-17న హడావిడి చేస్తోంది. ఆనాటి కాంగ్రెస్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పుకుని ఇప్పుడు పబ్బం గడుపుకోవాలని చూస్తోంది బీజేపీ. ఈ రెండు పార్టీలను నమ్మాలా..? లేక తెలంగాణ సాధకుడు కేసీఆర్ సారథ్యాన్ని కోరుకోవాలా..? ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి పథంలో మరింత ముందుకెళ్లాలంటే కేసీఆర్ సారథ్యం అనివార్యం అని చెబుతున్నారు.