34 టికెట్లు అడుగుతున్నకాంగ్రెస్ బీసీ నేతలు.. ఎక్కువ మంది సీనియర్లే!
17 లోక్ సభ నియోజకవర్గాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా చెప్పారని గుర్తుచేశారు. సర్వేల పేరుతో బీసీలకు హ్యాండిచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి ఖర్గే, కేసీలను కలిసి డిమాండ్ వారి ముందుంచాలని నిర్ణయించారు.
ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఇప్పుడు టీకాంగ్రెస్‌లో కాక రేపుతోంది. తమకు ఈ ఎన్నికల్లో 34 సీట్లు కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు పట్టుబడుతున్నారు. తమ వాణి వినిపించేందుకు ఈ రోజు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లను కలవాలని నిర్ణయించారు. ఈ డిమాండ్ వినిపిస్తున్న నేతలంతా అత్యంత సీనియర్ నేతలు కావడంతో టీపీసీసీ తల పట్టుకుంటోంది.
వీహెచ్, పొన్నాల, పొన్నం సహా 70 మంది హాజరు
బీసీలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలో చర్చించడానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, సురేష్ షేట్కార్ లాంటి సీనియర్ నేతలతోపాటు కత్తి వెంకటస్వామి, చెరుకు సుధాకర్, పున్న కైలాష్ వంటి బీసీ నేతలు 70 మంది సమావేశంలో పాల్గొన్నారు. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా చెప్పారని గుర్తుచేశారు. సర్వేల పేరుతో బీసీలకు హ్యాండిచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి ఖర్గే, కేసీలను కలిసి డిమాండ్ వారి ముందుంచాలని నిర్ణయించారు.
అవసరమైతే రాహుల్ దగ్గరికి కూడా
వీళ్లిద్దరినీ కలిసిన తర్వాత రాహుల్ గాంధీని కూడా కలిసి బీసీలకు టికెట్ల డిమాండ్‌ను ఆయన ముందు కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన పూనుకుంటేనే తమకు ఆశించిన స్థాయిలో టికెట్లు దక్కుతాయని బీసీ నేతలు కొండంత ఆశతో ఉన్నారు. కానీ, పొన్నాల, పొన్నం వంటి నేతల టికెట్లకే మంగళం పాడేలా ఉన్న టీపీసీసీ నాయకత్వం ఈ ప్రయత్నాలు ఫలించనిస్తుందా అనేది చూడాలి.