NSUI అధ్యక్షుడిగా ఏపీ వ్యక్తి.. టీ.కాంగ్రెస్‌లో వివాదం
వెంకటస్వామి బాపట్ల జిల్లా చిన కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు.
NSUI రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తెలంగాణ కాంగ్రెస్‌లో అగ్గి రాజేసింది. NSUI అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని నియమించడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. దీంతో సొంత పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే!
తెలంగాణ NSUI అధ్యక్షుడిగా ఈనెల 13న యడవల్లి వెంకటస్వామిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. వెంకటస్వామి ఏపీకి చెందిన వ్యక్తి. బాపట్ల జిల్లా చిన కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. వెంకటస్వామి నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ రాశారు. వెంకటస్వామిని తొలగించి వెంటనే తెలంగాణకు చెందిన వ్యక్తికి NSUI అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి రాజస్థాన్‌కు చెందిన అభిషేక్ మను సింఘ్విని ఎంపిక చేయడంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా NSUI అధ్యక్షుడిగా వెంకటస్వామి నియామకంతో స్థానికేతరులను అందలమెక్కిస్తున్నారన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఈ వివాదం కాంగ్రెస్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారింది.